ఓటుకు నోటు కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఉన్నట్టుండి ఈ కేసుపై కేసీఆర్ ఎందుకు రివ్యూ చేశారూ, దీని వెనక భాజపా ప్రోత్సాహం ఏదైనా ఉందా అనే కోణంలో కొన్ని విశ్లేషణలూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్ రివ్యూ చేశారన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే ఈ సమీక్ష అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకి రావడం, తాను బస్సు యాత్ర చేస్తూ తెరాస సర్కారుపై విమర్శలు చేస్తుండటం చూసి ఓర్వలేకనే ఈ డ్రామాలు ఆడుతున్నారు అన్నారు.
మోడీకి చంద్రబాబు నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్నీ, కేడీగారి నిజ స్వరూపాన్ని తాను బయటపెట్టడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని రేవంత్ చెప్పారు. మోడీ ఆదేశాల మేరకే ఈ రివ్యూ జరిగిందని ఆరోపించారు. కేసు జరిగిన రోజుకంటే ఎక్కువగా మీడియాలో రివ్యూకి ప్రాధాన్యత కల్పించేలా కేసీఆర్ చేశారన్నారు. తమని భయపెట్టి, బెదిరించి లొంగదీసుకోవాలన్న లక్ష్యంతో ఆడుతున్న నాటకమిది అన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తాను మాట్లాడలేననీ, ఎందుకంటే ఇదే కేసులో తాను బెయిల్ పై ఉన్నానీ, ఈ అంశంపై మీడియా ముందు ప్రస్థావించొద్దనే నిబంధనకు తాను లోబడి ఉంటున్నా అన్నారు. కానీ, అవినీతి నిరోధక శాఖ వ్యవహార శైలిని, ముఖ్యమంత్రి జోక్యాన్ని ఈ సందర్భంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ వారిపై సరైన ఆధారాలు లేవంటూ, ఒక్క 2016లోనే 125 మంది మీద కేసులను ఉప సంహరించారన్నారు. అంటే, అవినీతిపరులను కాపాడటంలో ఈ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.
కేటీఆర్ సామాజిక వర్గానికి చెందినవారు ఎవరైనాసరే, అవినీతి నిరోధక శాఖకు పక్కా ఆధారాలతో దొరికినా… ఓ మూడు నెలల్లోనే వాళ్లకి విముక్తి లభిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతిపరులకు కేసీఆర్ ఈ విధంగా అండగా నిలుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో వందల కోట్లు అవినీతి జరుగుతోందన్నారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి కుటుంబం అండగా ఉంటోందన్నారు. వీటిపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తాను బస్సు యాత్ర చేశాననీ, ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో చూసి ఓర్వలేకనే రివ్యూ పేరుతో ఓటుకు నోటు కేసును మరోసారి తెరపైకి తెచ్చి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మోడీ కేడీల రాజకీయ కుట్ర అని రేవంత్ అభివర్ణించారు.