ఆంధ్రుల రాజధాని అమరావతి పక్కనున్న బెజవాడలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరూవాడా తిరిగి ప్రచారం చేయడానికి వారి కోసం హైకమాండ్ ప్రత్యేకంగా బైకులు పంపింది. అదీ ఉత్తరప్రదేశ్ నుంచి! బెజవాడ బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ బైకులు కొలువుదీరాయి. ఎన్నికల్లో ప్రచారానికి, గ్రౌండ్ వర్క్ కోసం ఈ బైకులను ఉపయోగిస్తారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి ఈ బైకులనే వాడారు. ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. తెల్లటి ఈ బైకుల మీద మోదీ బొమ్మలు తప్ప ఏం లేవు. ఓపక్క ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశమై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏపీలో చాలామంది బీజేపీపై ఆగ్రహంతో వున్నారు. అటువంటి వాటిని మోదీ అండ్ కో పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. త్వరలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వేసే అడుగులు ఎవరికీ అంతుచిక్కడం లేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తర్వాత విభజన చట్టంలో హామీలను సరిగా నెరవేర్చలేదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు అదే తప్పును కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ మాట్లాడుతున్నారు. మరోపక్క ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఏ ధైర్యంతో బీజేపీ పెద్దలు ఏపీలో అడుగులు వేస్తున్నారో మరి?