కాంగ్రెస్కు అహంకారం ఇంకా తగ్గలేదని మరో వందేళ్లు అధికారంలోకి రాలేరని.. దానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోడీ సమాధానం ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్ను ఆయన చాలా ఘాటుగా టార్గెట్ చేశారు. కరోనా సంక్షోభంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించిందని .. కానీ దేశంలో విపక్షాలు మాత్రం సర్కార్ను నిందించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరుసగా ఓడిపోతున్న రాష్ట్రాల గురించి చెబుతూ ఇన్ని ఎన్నికల్లో ఓటమిపాలైనా కూడా ఇప్పటికీ కాంగ్రెస్కు అహంకారం తగ్గలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మీరు క్రెడిట్ తీసుకుందామనుకున్నారు కానీ అక్కడి ప్రజలు మిమ్మల్ని అంగీకరించలేదని తెలంగాణ అంశాన్నీ ప్రస్తావించారు.
రాహుల్ గాంధీ దేశంలో రెండు ఇండియాలంటూ చేసిన ప్రసంగంపై మోడీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను విమర్శిస్తున్నారు. వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉంటామన్నారు. పేదలు కూడా లక్షాధికారుల వర్గంలోకి వచ్చారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.పేదల ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. టాయిలెట్ ఉందన్నారు. కాంగ్రెస్ విమర్శలకు వప్రతి విమర్శలతో మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు.