ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారం చేపట్టి ఏడేళ్లు అవుతోంది. ఆయన కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించానని చెబుతూంటారు. దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లామని బీజేపీ నేతలు ప్రచారం చేస్తూంటారు. కానీ ఇప్పటికీ.. కొన్ని కొన్ని అంశాల్లో గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెరుగుతున్న పెట్రో ధరల పాపం గత ప్రభుత్వాలదేనని… ప్రధాని మోడీ తేల్చేశారు. గత ప్రభుత్వాలు దిగుమతులు తగ్గించడం దిశగా ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలేదని.. అందుకే… తాము దిగుమతులు చేసుకుని రేట్లు పెంచక తప్పడం లేదని ఆయన వాదన.
ప్రస్తుతం పెట్రో ధరలు రోజూ పెంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్నాయి కాబట్టే పెంచుతున్నామని కేంద్రం చెబుతోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు… తగ్గించలేదు. దాన్ని మాత్రం ఎప్పుడూ ప్రస్తావించారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ధరలు పెరగకపోయినప్పటికీ… ఇండియాలో రేట్లు మాత్రం పెరుగుతూ ఉంటాయని… ఈ అంశంపై అవగాహన ఉన్న వారు చెబుతూ ఉంటారు. ఈ విషయంపై అవగాహన ఉన్న వారెవరికైనా… పెట్రో ధరల పెంపునకు.. అంతర్జాతీయ ధరలు కారణం కాదని స్పష్టంగా తెలుసు. ఒక్క లీటర్ పెట్రోల్ రూ. వంద రూపాయలకు అమ్ముతూంటే.. అందులో రూ.70 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే.
కాంగ్రెస్ హయాంలో ఉన్న ఎక్సైజ్ పన్ను కంటే.. నాలుగింతలు ఎక్కువగా మోడీ ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు కూడా.. ఇండియాలో పెట్రో రేట్లు తగ్గించలేదు. కానీ… కనిష్ట స్థాయి నుంచి కొద్దిగా రేటు పెరిగినా… రేట్లు పెంచడం ప్రారంభించారు. ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ.. కవర్ చేసుకున్నారు. రేట్లు పెరిగినప్పుడు మాత్రం ప్రజలపై బాదేశారు. పెట్రో రేట్ల పెంపు వల్ల… కేంద్రానికి మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కానీ దీని వల్ల… ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినా కేంద్రం కానీ ప్రధాని మోడీ కానీ .. తమ ఆదాయంపైనే దృష్టి పెట్టారు. గత ప్రభుత్వాలపై తప్పు తోసేసి.. తాము రాజకీయం చేసుకుంటున్నారు. మధ్యలో ప్రజలు మాత్రం…. నలిగిపోతున్నారు.