నేడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగబోతోంది. ఎన్డీయే భాగస్వామ పార్టీలకి చెందిన 19 మందిని మంత్రివర్గంలోకి తీసుకుబోతున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. వచ్చే రెండేళ్లలో వివిధ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలలో వివిధ సామాజిక వర్గాలకి చెందినవారిని మంత్రులుగా తీసుకోబోతున్నారు. ఈరోజు ఉదయం 11గంటలకి రాష్ట్రపతిభవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.
మరో విశేషం ఏమిటంటే ఈసారి మంత్రివర్గ విస్తరణలో పూర్తిగా కుల, రాజకీయ సమీకరణాలకి ప్రాధాన్యతనిస్తూనే వివిధ రంగాలలో పేరొందిన వారిని కూడా మంత్రులుగా తీసుకోబోతున్నారు. అటువంటివారిలో ప్రముఖ జర్నలిస్ట్ ఎం.జె.అక్బర్, ప్రముఖ వైద్యుడు సుబాష్ రావు భమ్రే, నర్మదా ప్రాజెక్టుపై మంచి అవగాహన ఉన్న అనిల్ మహాదావె, సుప్రీం కోర్టు న్యాయవాది పిపి చౌదరి తదితరులున్నారు.
మంత్రివర్గ విస్తరణ చేస్తూనే పనిచేయని మంత్రులకి ఉద్వాసన, బాగా పనిచేసినవారికీ మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు స్వతంత్ర హోదాతో మంత్రులుగా పనిచేస్తున్న పీయూష్ గోయల్ (ఇంధన శాఖ), నిర్మలా సీతారామన్ (వాణిజ్యం, పరిశ్రమలు), ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం), ముక్తార్ అబ్బాస్ నక్వీ (మైనార్టీ వ్యవహారాలు)లకి క్యాబినెట్ హోదా కల్పిస్తారని సమాచారం.
కనీసం ఆరుగురు మంత్రులకి ఉద్వాసన తప్పక పోవచ్చని తెలుస్తోంది. అలాగే మరికొందరికి శాఖల మార్పు జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీతో కలిపి మంత్రివర్గంలో మొత్తం 64మంది మంత్రులున్నారు. రాజ్యాంగ పరిమితి ప్రకారం గరిష్టంగా 82మంది వరకు అవకాశం ఉంది. ఇవాళ్ళ 19మందిని చేరుతున్నారు కనుక మంత్రివర్గ విస్తరణ ఇదే ఆఖరిసారి అని భావించవచ్చు.