ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ .. తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మెట్రో నగరాలు ఉన్న రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే.. మెట్రో నగరాలు లేకపోయినా.. కర్నూలు వంటి ఓ మాదిరి పట్టణాలు ఉన్న ఏపీలో కరోనా ప్రమాదకరంగా విస్తరిస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ జగన్ ను వివరాలు అడిగినట్లుగా తెలుస్తోంది. కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని… అన్ని రకాల సామాగ్రిని సమకూర్చుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రధానికి తెలిపినట్లుగా అధికారిక ప్రకటన విడులయింది.
అయితే.. కేంద్రం నిఘా వర్గాలు మాత్రం.. ఏపీలో నమోదవుతున్న కేసులకు… ప్రకటిస్తున్న కేసులకు పొంతన లేదన్న నివేదికను కేంద్రానికి ఇచ్చాయని చెబుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ పదహారు మంది కరోనా కారణంగా చనిపోయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒకరో ఇద్దరో మినహా.. దాదాపుగా అందరూ.. చనిపోయిన తర్వాత పరీక్షల ద్వారా కరోనాగా నిర్ధారణ అయింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. కరోనా వచ్చిన విషయాన్ని దాచి పెట్టి.. చనిపోయిన తర్వాత తప్పనిసరిగా పాజిటివ్ అని బయట పెడుతున్నారా.. అన్న అనుమానాలతో.. కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వెళ్తున్నాయి. వీటికి కొన్ని ఆధారాలను కూడా సమర్పిస్తున్నట్లుగా చెబుతున్నారు.
మరో వైపు.. టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ ప్రమాణాలను ఏపీ పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఐసీఎంఆర్ ప్రమాణాల ప్రకారం.. ఏపీలో ఏడు ల్యాబ్లుఉన్నాయి. ఇవి ఇరవై నాలుగు గంటలూ పని చేసినా 990 టెస్టులు మాత్రమే చేయగలవు. అయితే.. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతోనే… టెస్టులు చేసి.. నెగెటివ్ గా నిర్ధారించడం ఎక్కువగా ఉంది. రోజుకు ఐదు వేల వరకు టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇవన్నీ.. కరోనాను దాచి పెట్టే ప్రయత్నాలని..ఇది చాలా ప్రమాదకరమన్న అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి సందేహాలు ఉన్న సమయంలో.. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ… జగన్ కు ఫోన్ చేయడంతో… ఏం చర్చించి ఉంటారనే ఆసక్తి ఏర్పడింది.