ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో రూట్ లెవల్లో ప్రజలతో కనెక్ట్ అయ్యే విషయాలను ఎంచుకుంటారు. తాజాగా ఆయన మన్ కీ బాత్‌లో అరకు కాఫీ గురించి గుర్తు చేసుకున్నారు. అరకు వ్యాలీ కాఫీ స్థాయిని ప్రపంచస్థాయిలో విస్తృతం చేయడంలో గిరిజన సహాకార సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాదిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ముందు వరుసలో ఉంటుందన్నారు.
శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు వుందని ప్రధాని అన్నారు. 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారని అన్నారు. మన్ కీ బాత్ తర్వాత మోదీ ట్విట్టర్లో అరకు కాఫీ రుచి చూసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం సందర్శించినపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించే అవకాశం లభించిందని ప్రధాని మోడీ మన్ కి బాత్ లో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబుతో కలిసి కాఫీ తాగుతున్న ఫోటోలను ట్విట్టర్లో పెట్టారు.
మోదీ ట్వీట్‌కు చంద్రబాబు కూడా రిప్లయ్ ఇచ్చారు. మన గిరిజన బిడ్డలు ప్రేమతో సాగు చేస్తున్న కాఫీ గింజలని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందండం సంతోషంగా ఉందన్నారు. మోదీతో కలిసి మరో కప్పు అరకు కాఫీని రుచి చూడటానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. అరకు కాఫీకి గత ఐదేళ్లలో ప్రోత్సాహం కరవయిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మోదీ ప్రమోట్ చేయడంతో దేశీయంగానూ డిమాండ్ లభించే అవకాశం ఉంది.