పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై భీకర దాడికి విపక్షాలు సిద్ధమయ్యాయి. జెఎన్ యు వివాదం సహా అనేక అంశాలపై మోడీ సర్కారును ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇతర విపక్షాలు అస్త్ర శస్త్రాలతో సంసిద్ధమయ్యాయి. వీటిని దీటుగా ఎదుర్కోవడానికి కమలనాథులు కూడా రెడీ అయ్యారు.
బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. సభలో చర్చ తప్ప రచ్చ వద్దని హితవు పలికారు. కానీ రేపటి నుంచి సభలో రచ్చ తప్ప చర్చకు ఆస్కారం లేదని అప్పుడే పలు విపక్షాలు సంకేతాలిచ్చాయి. రోహిత్ ఆత్మహత్య, జెఎన్ యు వివాదం, అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ మార్పు, తదితర అంశాలతో మోడీ ప్రభుత్వంపై దాడికి కాంగ్రెస్ తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది.
ఇంతకాలం ఓపిక పట్టాం, ఇక విపక్షాలను కట్టడి చేయాల్సిందేనని బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జెఎన్ యు వివాదంలో ప్రజల మద్దతు తమకే లభించిందని కేంద్రం, బీజేపీ భావిస్తున్నాయి. దేశద్రోహులకు మద్దతు తెలిపే వ్యక్తులుగా రాహుల్ గాంధీ, ఇతర నేతలను ప్రజల ముందు నిలబెట్టడానికి పార్లమెంటే సరైన వేదిక అంటున్నారు కమలనాథులు. దేశాన్ని ముక్కలు చేస్తాం, కాశ్మీర్ కు స్వాతంత్ర్యం సాధిస్తాం, అఫ్జల్ గురు అమర్ హై వంటి నినాదాలు చేసిన వారిని రాహుల్ గాంధీ గట్టిగా వెనకేసుకు వస్తున్నారని ఇప్పటికే బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.
ఈసారి కమ్యూనిస్టుల దాడిని కూడా దీటుగా తిప్పికొడతామని బీజేపీ నేతలు చెప్తున్నారు. జెఎన్ యు వివాదంలో జాతి వ్యతిరేకులను వామపక్షాలు మద్దతునివ్వడం ప్రజలు గమనించారని, సభలోనూ వారి నిజస్వరూపాన్ని బయటపెడతామని కమలనాథులు అంటున్నారు. విపక్షాలు మాత్రం ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కుతోందని ఆరోపిస్తున్నాయి. ప్రతిసారీ రాజ్యసభలో కొన్ని పార్టీలు ఆడింది ఆటగా మారింది. ఈసారి మాత్రం తామే ముందుగా దాడి చేయడానికి రెడీగా ఉన్నామంటున్న బీజేపీ వారిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఓ వైపు ఉగ్రవాదులతో పోరాడి సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే దేశ ద్రోహులకు విపక్షాలు మద్దతు ఇవ్వడం సబబా అని సభా వేదికపైనే అధికార పక్షం ప్రశ్నించబోతోంది.
మొత్తానికి మాటల తూటాలు పేటడం, నినాదాలతో ఉభయ సభలూ దద్దరిల్లదం అనివార్యమనే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ పంతాలు పట్టింపుల మధ్య ప్రజల సమస్యలను గాలికి వదిలేయడం ఇప్పటికే ఆనవాయితీగా మారింది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ కావచ్చు. సభా సమరంలో ఏ పార్టీ గెలిచినా, ప్రజలకు మాత్రం పదే పదే ఓటమి తప్పడం లేదు.