మాయాబజార్ సినిమా గుర్తుందా? అందులో ఘటోత్కచుడు నిర్వహించే మంత్ర తంత్రాల పాఠశాల ఉంటుంది. అందులో లంబు జంబు అనే ఇద్దరు ప్రత్యేకమైన విద్యార్థులు ఉంటారు. అస్మదీయులు అనే పదాన్ని గురువు నేర్పిస్తే.. దానికి వ్యతిరేక పదం తస్మదీయులు అంటూ కొత్త పదాన్ని సృష్టిస్తాడు జంబు. వీడు కొత్త పదాలు చెబుతున్నాడు దేవరా.. అని గురువు ఫిర్యాదు చేస్తే.. ‘ఎవరూ సృష్టించకుండా భాష ఎలా పెరుగుతుంది.. వెయ్యండి వీడికి రెండు వీరతాళ్లు’ అంటూ అభినందనలు చెబుతాడు ఘటోత్కచుడు. ఈ హాస్య సన్నివేశం సాధారణంగా అందరికీ గుర్తుంటుంది.
ఆ లెక్కన చూసినట్లయితే ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా రెండు వీరతాళ్లు వేయాల్సిందే. అవును మరి ఆయన కూడా భాషకు ఒక కొత్త పదాన్ని అందించారు. ఆ కొత్త పదాన్ని భాషా పరంగా, ప్రభుత్వ పరంగా అధికారికంగా గుర్తించడానికి ప్రయత్నం కూడా జరుగుతున్నది. అందుకే మోడీకి రెండు వీరతాళ్లు వేస్తే సరిపోతుంది.
ఇటీవల తన ప్రసంగంలో మోడీ అంగవైకల్యం వారి గురించి అలా కించపరిచేలాంటి పదజాలంతో కాకుండా ‘దివ్యాంగ’ అంటూ సంబోధించారు. ఇంగ్లిషులో అయితే వీరిని గౌరవప్రదంగా సంబోధించడానికి ప్రత్యేకమైన పదం ఉంది. ఇదివరలో డిజేబుల్డ్, హ్యాండిక్యాప్డ్ అనే పదాలే ఉండేవి. ఇప్పుడు వారిని అలా కించపరిచినట్లు కాకుండా.. డిఫరెంట్లీ ఏబుల్డ్ అని సంబోధిస్తున్నారు. అయితే వీరికి స్వభాషలో కూడా మరింత గౌరవ ప్రదమైన పదాన్ని సృష్టిస్తూ ‘దివ్యాంగ’ అని మోడీ సంబోధించారు. ఆమేరకు ‘వికలాంగ’ అనే పదం ఇక వాడరు. దీనికి చట్టబద్ధత కల్పించడానికి అందరూ తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాసింది. మొత్తానికి నరేంద్రమోడీ భాషకు ఒక గౌరవప్రదమైన పదాన్ని అందించినట్లయింది