ఆంధ్రప్రదేశ్ విభజన ఎలా జరిగిందో.. దేశం మొత్తం చూసింది. రెండు ప్రాంతాల ప్రజల .. రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఉన్నప్పుడు… అత్యంత అప్రజాస్వామికంగా.. కాంగ్రెస్, బీజేపీ కలిసి… పార్లమెంట్ తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి… విభజన చేశాయి. ఆ గాయం మానకుండా.. బీజేపీ.. ఐదేళ్లలో ఎంత చేయాలో.. అంత చేసింది. కీలకమైన అంశాలపై రెచ్చగొట్టింది. పరిష్కరిచాల్సిన అంశాలపై మౌనంగా ఉంది. విభజనతో అన్యాయమైన రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి… దారుణంగా మోసం చేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు.. ఈ విభజన అంశాన్ని.. మోడీ ఉత్తరాది రాష్ట్రాల్లో.. ఓట్ల వేటకు వాడుకుంటున్నారు. తెలుగు ప్రజలు కొట్టుకు చస్తున్నట్లుగా.. కవరింగ్ ఇస్తూ.. ఆ పాపం కాంగ్రెస్‌దేనని చెబుతూ… ఎన్నికల ప్రచారంలో ఎలుగెత్తుతున్నారు. చివరికి… దేశ విభజనకు .. ఏపీ విభజన ద్వారానే కాంగ్రెస్ కుట్ర చేసిందనేస్తున్నారు. ఆ కుట్రలో తామూ భాగమయ్యామనే సంగతిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేస్తున్నారు.
” ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ విధానాల కారణంగానే ఐదేళ్ళయినా రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కాలేదు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలే ఉన్నా ఒకరి కళ్ళలోకి ఇంకొకరు చూసుకోలేని పరిస్థితి ఉంది’ అని సందర్భం లేకపోయినా బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పాపం మొత్తం కాంగ్రెస్‌పైకి నెట్టే ప్రయత్నమే ఇది. ఎందుకంటే.. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి ఏపీని రెండు ముక్కలు చేశాయి. కాంగ్రెస్ విధానం లోపభూయిష్టంగా ఉంటే.. బీజేపీ అప్పుడే అడ్డుకోవాల్సిందన్న అభిప్రాయం సగటు ఆంధ్రుడికి వస్తుంది. ఎందుకంటే… ప్రత్యేకహోదాను చట్టంలో చేర్పించింది.. తామేనని.. బీజేపీ నేతలు ఇప్పటికీ గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఆ హామీ.. నెరవేర్చకపోయినా సరే క్రెడిట్ తీసుకునే విషయంలో మాత్రం వెనుకడుగు వేయరు. రాష్ట్రాల విభజనలో వాజ్ పేయి ప్రభుత్వం ఉభయులకూ నష్టంలేకుండా చేసిందని మోడీ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. నిజానికి వాజ్ పేయి హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలూ సంబంధిత ఉమ్మడి రాష్ట్రాల అసెంబ్లీల ఏకగ్రీవ తీర్మానాలతో ఏర్పడ్డాయి. అప్పుడే తెలంగాణ డిమాండ్ కూడా వచ్చింది.
ఈ డిమాండ్ లో బీజేపీ తెలంగాణ నాయకుల ఒత్తిడి కూడా ఉంది. అయితే అప్పట్లో టీడీపీ నుంచి 29మంది ఎంపీలు ఉన్నారు. మద్దతు ఉపసంహరిస్తే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో.. తెలంగాణ అంశాన్ని పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఉంటేనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని చెప్పి తెలివిగా తప్పించుకుంది. 2014లో ఏపీ అసెంబ్లీ రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. అయినా బీజేపీ విభజన బిల్లుకు మద్దతిచ్చింది. ఆంధ్రప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించి..మళ్ళీ అదే ప్రజల్ని ఓటు అడిగారు మోడీ. రాజకీయ అవసరాలకోసం కాంగ్రెస్ తోనే కుమ్మక్కు అయ్యారు బీజేపీ నేతలు. ఏపీని విభజిస్తే తెలంగాణలో బలపడతామని.. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ ఆశ పడ్డాయి. ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయవచ్చని స్కెచ్ వేశాయి. నిజానికి ఉత్తర ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అక్కడి తీర్మానం చేసింది. కానీ.. పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం.. ఏపీ విభజనను.. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వాడుకుంటూ రాజకీయం చేసేస్తున్నారు.