పరిపాలనా పటిమతో ప్రజాదరణ పొందిన ప్రధానుల్ని చూశాం. ప్రజలకు మేలు చేస్తూ పట్టు నిలుపుకునే ప్రధాల్ని చూశాం! కానీ, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. సామాన్య ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు ఏం తీసుకున్నారో వారే చెప్పలేరు. చారిత్రక నిర్ణయమైన పెద్ద నోట్ల రద్దుతో ఏం సాధించారో ఇంతవరకూ మాట్లాడలేకపోయారు. దేశ ప్రజలందరికీ మేలు చేసే పథకాలు ఏవైనా ప్రవేశపెట్టారేమో అని తరచి చూసుకున్నా… ప్రయోజనం ఉండదు. కానీ, దేశవ్యాప్తంగా మోడీ బ్రాండ్ ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతూ ఉండటం విచిత్రం! రాష్ట్రాల వారీగా, పార్టీల వారీగా, నాయకుల వారీగా మోడీకి మోకరిల్లుతున్నారు. దేశం దాసోహం అనే స్థాయికి తీసుకొస్తున్నారు..! ఈ ప్రయాణం ఎటువైపు అనేదే విజ్ఞుల ఆవేదన!
రాష్ట్రాలను తన కంట్రోల్ ఉంచుకునేందుకు కొత్త తరహా రాజకీయ ఎత్తుగడలు మోడీ వేస్తున్నారు. దండోపాయంతో అందర్నీ దారిలోకి తెచ్చుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకూ హూంకరించిన మమతా బెనర్జీ కూడా మోడీ విషయంలో గొంతు సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! రాష్ట్రపతి ఎన్నికల్లో అద్వానీ, సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్.. ఎవరు బరిలో ఉన్నా మద్దతు ఇస్తామని ఆమె అన్నారు. మమతా ఇలా మారిపోవడానికి… నారదా స్టింగ్ ఆపరేషన్ కారణం కావొచ్చు, శారదా చిట్స్ కేసు కావొచ్చు, లేదంటే.. కొంతమంది మమతా అనుయాయులు భాజపావైపు చూస్తున్నట్టు తెలియొచ్చు! సో.. మమతాను ఇలా దారిలోకి తెచ్చుకున్నారన్నమాట.
మమత ఒక్కరే కాదు… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో మోడీపై ఒంటికాలి మీద లేచినవారే. ఇప్పుడు… మోకరిల్లేశారు! భక్తాగ్రేశ్వరుడిగా ముందు వరుసలో కూర్చుండిపోయారు. ఇక, చంద్రబాబు నాయుడు సంగతి ప్రత్యేకంగా చెప్పాలా..? మోడీతో దోస్తీ కొనసాగింపు ఎంత అవసరమో ఆయనకి తెలియంది కాదు. ఆ అవకాశాన్ని మోడీ ఎందుకు వదులుకుంటారు..? ఇక, ప్రతిపక్ష నేత జగన్ వ్యవహారమూ అంతే… అర్ధ అంగీకార సూచకంగా మౌనంగానే ఉంటున్నారు. ఓటమితో తలబొప్పి కట్టి కూర్చున్న ములాయం కావొచ్చు, జైల్లో ఉన్న శశికళ కావొచ్చు, దిక్కుతోచని పన్నీర్ సెల్వమ్ కావొచ్చు, ఏ దిక్కు వెళ్లాలో అర్థం కాని పళనిస్వామి కావొచ్చు, పెద్ద దిక్కు కోసం దిక్కులు చూస్తున్న స్టాలిన్ లాంటివాళ్లు కావొచ్చు… ఇలాంటి కారణాలతో దక్షిణాది ప్రముఖులు మోడీకి ఎప్పుడో బెండ్ అయిపోయారు. ఉత్తరాదితోపాటు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
అయితే, ఇక్కడ గమనించాల్సిందీ, ఆవేదన కలిగించే అంశం ఏంటంటే… అభిమానంతో కాకుండా, అధికారంతో అందరినీ తన ముందుకు మోకరిల్లేలా మోడీ చేస్తున్నారు. ఈ ధోరణి మున్ముందు ఎలాంటి తరహా రాజకీయాలకు దారి తీస్తుందనేది ప్రశ్నార్థకంగా మారుతోందంటూ విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు.