గజ్వేల్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ తన హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు చాలా పటిష్టం అయ్యాయని, ఘర్షణ వాతావరణం తగ్గి స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడిందని అందుకు కేంద్రప్రభుత్వం-తెలంగాణా ప్రభుత్వాల మద్య నెలకొన్న సంబంధాలే చక్కటి ఉదాహరణ అని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కేంద్ర సహాయసహకారాలతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణా విషయంలో అది నూటికి నూరు పళ్ళు నిజమే కావచ్చు కానీ ఇతర రాష్ట్రాల విషయంలో మాత్రం అటువంటి వాతావరణం కనబడదు.
ఉదాహరణకి పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది. దాని సమస్యలు, కష్టాలు..వాటి పట్ల మోడీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అందరికీ తెలుసు కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ తో కేంద్రప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అందరికీ తెలుసు. చివరికి ఆ రాజకీయాలు మాజీ ముఖ్యమంత్రి కలికి పుల్ ప్రాణాలు తీసాయి. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కేంద్రప్రభుత్వం ఏవిధంగా ఆడుకొందో చెప్పనవసరంలేదు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ చాలా గట్టివాడు గాబట్టి తట్టుకొని నిలబడ్డాడు లేకుంటే ఎప్పుడో అధికారం కోల్పోయేవాడు.
ఇక డిల్లీలోనే ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం ఏవిధంగా ముప్పతిప్పలు పెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో ఆయనకి తెలియకుండా సిబిఐ అధికారులు శోదాలు నిర్వహించారు. ఎసిబి అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యేలని ఏదో ఒక కారణంతో పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రావణ కాష్టంలాగా రగులుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడి పరిస్థితి గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అక్కడ ఉన్నదీ భాజపా-పిడిపి సంకీర్ణ ప్రభుత్వం కావడమే అందుకు కారణం అయ్యుండవచ్చు. చివరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ డిల్లీ వచ్చి పరిస్థితులని చక్కదిద్దామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ని బ్రతిమాలుకోవలసి వచ్చింది.
మరి ఫెడలరలిజం..కేంద్ర రాష్ట్రాల సంబంధాలు..సహకారం..రాష్ట్రాల అభివృద్ధి..దేశాభివృద్ధి…అంటూ మోడీ ఇచ్చిన లెక్చర్ నిజమనుకోవచ్చా?