ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడు రోజుల కిందట కరోనాపై పోరాడుతున్న వారియర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలో ఆయన కరోనాతో చనిపోయిన వారిని గుర్తు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు. నిజానికి ఓ ప్రధానమంత్రి ఇలా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటే.. ముఖ్యంగా మోడీ లాంటి ప్రెస్ రిలేషన్స్‌ను… సామ, బేద, దాన దండోపాయాలతో అద్భుతంగా నిర్వహించే మోడీ లాంటి ప్రధాని కన్నీరు పెట్టుకుంటే.. అదోక బ్లాస్టింగ్ న్యూస్ అయిపోతుంది.ఆయన ఎంత ఆవేదన చెందారో.. ఆయన భక్తులు ఎన్నో రకాలుగా విశ్లేషించి సోషల్ మీడియాను హోరెత్తించేవారు. కానీ విచిత్రంగా.. మోడీ కన్నీటికి ఇప్పుడు నెగిటివ్ రిమార్కులే వస్తున్నాయి కానీ.. ఆయన నిజంగా ఆవేదన చెందారని ఎవరూ అనుకోవడం లేదు.
మొసలి కన్నీరు పేరుతో… పెద్ద ఎత్తున కార్టూన్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మోడీ గొప్ప నటుడని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నారని అంటున్నారు. కన్నీరు పెట్టుకున్నందుకు ఆయనకు కనీసం సానుభూతి దక్కకపోగా… నాటకాలు ఆడుతున్నారనే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి కారణం.. కరోనా విషయంలో ఆయన ప్రజల్ని అలా వదిలేయమేనని చెప్పుకోవచ్చు. కరోనా మొదటి వేవ్‌లో లాక్ డౌన్ ప్రకటించడం దగ్గర్నుంచి వ్యాక్సిన్లను దేశ ప్రజలకు కాకుండా విదేశాలకు ఎగుమతి చేయడం వరకు.. ప్రతి అంశంలోనూ ఆయన తీరు ప్రజలకు నష్టమే చేసింది. అంతే కాదు.. చివరికి ఇప్పుడు వ్యాక్సిన్లు విరివిగా అందుబాటులో వస్తున్నా.. ఆర్థిక కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాల మీదకు నెట్టేశారు .,దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు.
కరోనా పరిస్థితుల్ని అత్యంత దారుణంగా డీల్ చేసిన విమర్శలను మోడీ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన కన్నీరు పెట్టుకోవడం వల్ల తాను తప్పు చేశానని అంగీకరించారన్న భావన ప్రజల్లోకి వెళ్తోంది. లెక్కలోకి రాని కరోనా మరణాలు లక్షల్లోనే ఉంటాయి. ఎన్నోకుటుంబాలు దిక్కు లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో..మోడీ ఎదురొడ్డి నిలబడి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి.. మొసలి కన్నీరు కాల్చి.. మరింత దిగజారిపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.