కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పొదుపు చేయాలనుకునే మధ్యతరగతి ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. అసలు పొదుపు చేస్తే ఉన్న రూపాయి విలువ తగ్గిపోతుందని…అసలు చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా చేస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చిన్నామొత్తాల పొదుపులపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాలో ఎక్కడా హైలెట్ కానీ ఈ నిర్ణయం వల్ల.. దేశవ్యాప్తంగా సగం మందికిపైగా మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
చిన్న మొత్తాల పొదుపుపై భారీగా వడ్డీ కోత..!
రూపాయి పొదుపు చేస్తే.. రూపాయి సంపాదించుకోవడమేననే సూత్రాన్ని దేశంలోని మధ్యతరగతి ప్రజలు అనుసరిస్తూ ఉంటారు. తమకు ఎంత ఆదాయం వచ్చినా… కుటుంబఖర్చులు తగ్గించుకుని … జీవనప్రమాణాల్ని తగ్గించుకుని అయినా భవిష్యత్ భరోసా కోసం ఎంతో కొంత పొదుపు చేస్తూంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ప్రోత్సహించాయి. పొదుపు చేసుకోవడానికి వడ్డీ ఇచ్చేలా పలు కార్యక్రమాలు రూపొందించాయి. అయితే ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ కేంద్రం వదిలించుకోవాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వడ్డీ రేట్లు భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ డిపాజిట్ల మీద వడ్డీని కాలన్ని బట్టి ఒక శాతం వరకూ తగ్గించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వరకూ చిన్నమొత్తాలు డిపాజిట్ చేసే వారికి గతంలో గరిష్టంగా 6.7 శాతం వడ్డీ వచ్చేది. ఇప్పుడు అది కనిష్టంగా 3.5 శాతానికి పడిపోయింది.ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన ఆదేశాలు మధ్యతరగతి ప్రజల్లో గుబులు రేపుతున్నాయి.
వృద్ధులనూ వదిలి పెట్టని కేంద్రం..!
వృద్దులను కూడా కేంద్రం వదిలి పెట్టలేదు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద… జీవిత చరమాంకంలో నెలవారీ ఖర్చుల కోసం డిపాజిట్ చేసిన పెద్దలకు వడ్డీ ఆదాయంలో కోత పడింది. 7.4 శాతం నుంచి 6.5 శాతానికి కుదించారు. దీని వల్ల… తమ రిటైర్మెంట్ డబ్బో.. మరో కారణంగా సంపాదించిన సొమ్మునో డిపాజిట్ చేసుకుని నెలవారీగా వడ్డీ తీసుకుని గడిపేస్తున్న వృద్ధులకు ఆదాయం పడిపోనుంది. ఇది ఇరవై శాతం వరకూ తగ్గే అవకాశం ఉండటంతో వృద్ధుల్లో ఆందోళన ప్రారంభమయింది. మంత్లీ ఇన్కం అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిలో పొదుపు చేస్తున్నా… వడ్డీని నామమాత్రం చేశారు. కిసాన్ వికాస్ పత్రాలు.. చివరికి ఆడపిల్లల భవిష్యత్ భరోసా కోసం మధ్యతరగతి తల్లిదండ్రులకు భరోసా అంటూ ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో సేవ్ చేసుకునే రొక్కంపై వడ్డీని 7.6 నుంచి 6.9 శాతానికితగ్గించేశారు.
ప్రజల ఆర్థిక అలవాట్లను మార్చే వ్యూహం..!
నిజానికి రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఇప్పటి రూపాయికి.. పదేళ్ల తర్వాత వచ్చే రూపాయికి పొంతన ఉండటం లేదు. అలాంటిది.. దానికి తగ్గట్లుగా లెక్క గట్టి.. పొదుపు చేసుకునేవారికి.. పదేళ్ల తర్వాతమరింత ప్రయోజనం కల్పించాల్సిన కేంద్రం… అసలు పొదుపు చేయడం దండగన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి వడ్డీ రేట్లు కుదించింది. దీని వల్ల..దేశ ప్రజల ఆర్థిక అలవాట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. బహుశా.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు కేంద్రం ఇలా చేస్తుందేమోనన్న సందేహం కూడా ప్రజ్లలో ఏర్పడుతోంది.