ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోడీ గురించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేసే విమర్శల్లో ప్రధానంగా వినిపించేవి.. కనిపించేవి ఆయన కార్పొరేట్ మిత్రులు అంబానీలు..అదానీల గురించిన విమర్శలు. ఈ సారి రాహుల్ వారి గురించి పెద్దగా చెప్పడం లేదు. రిజర్వేషన్ల టాపిక్ పైకి వెళ్లిపోయారు. అయితే వీరి గురించి మోడీ మాట్లాడుతున్నారు. గతంలో అంబానీ, అదానీల గురించి రాహుల్ మాట్లాడేవారని.. కానీ ఇప్పుడు మాట్లాడటం లేదని.. ఎంత నల్లధనం ఇచ్చారని ప్రశ్నించడం ప్రారంభించారు.
ఐదేళ్లుగా విమర్శిస్తూ వచ్చి, ఎన్నికల ప్రక్రియ ఆరంభం కాగానే అదానీ, అంబానీలపై రాత్రికి రాత్రే విమర్శలు ఆపేశారు.. టెంపోల్లో ఎంత నల్లధనం మీకు చేరిందని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. అంబానీ, అదానీలకు నల్లధనం లింక్ పెట్టి మోదీ మాట్లాడటంతో రాహుల్ గాంధీ స్పందించారు. వారు టెంపోలలో డబ్బు కట్టలు పంపిస్తారని మీకు ఎలా తెలుసని.. మీకు అలాగే పంపేవారా అని ఎదురు ప్రశ్నించడం ప్రారంభించారు. అంతే కాదు.. అంబానీ, అదానీ గురించి మొదటి సారి వ్యతిరేకంగా మాట్లాడారని.. ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించింది.
అంబానీ, అదానీలు మోదీకి ఎంత సన్నిహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వారిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి వారిని చర్చనీయాంశం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ఇంత కాలం మోదీకి సపోర్టు చేస్తూ వస్తున్న మీడియాలోనూ కలకలం కనిపిస్తోంది. జీ మీడియా మోదీ కనిపించకుండా బ్యాన్ చేశాయి. అయితే ఆ తర్వాత సంస్థలో అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.