ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సభలో కాంగ్రెస్ తోపాటు యూపీలోని ఎస్పీ, బీఎస్పీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ… ఈ మూడూ ఒకే స్వభావంతో వ్యవహరిస్తాయని మోడీ అన్నారు. మాయావతి ఎప్పుడు చూసినా అంబేద్కర్ గురించి మాట్లాడతారే తప్ప, ఆయన సిద్ధాంతాలు ఆమెకి అవసరం లేదని విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ కూడా లోహియా విధానాల గురించి గొప్పగా చెప్పుకుంటుందనీ, యూపీలో శాంతిభద్రతలు ధ్వంసం కావడానికి వారి పాలనే కారణమని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల అవసరాలతో ఏమాత్రం పని ఉండదనీ, ఒక కుటుంబం మేలు కోసమే ఆ పార్టీ నాయకులు పని చేస్తారని ఎద్దేవా చేశారు.
అయోధ్యకు వచ్చిన ప్రధాని, రామమందిరం గురించి ఏదో ఒక ప్రకటన కచ్చితంగా చేస్తారని చాలామంది అనుకున్నారుగానీ…. ఆయన ఆ జోలికి వెళ్లలేదు! తన ప్రసంగంలో ఆ ప్రస్థావన కూడా తేలేదు. ఇది శ్రీరాముడి నేల అంటూ మాత్రమే తన ప్రసంగంలో మాట్లాడారు. ఇది ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలచే భూమి అనీ, ఈ ఆత్మవిశ్వాసమే గడచిన ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తమైందన్నారు మోడీ. నూట ముప్పై కోట్ల మంది ప్రజలు చేతులు కలిపేలా తాము చేశామనీ, నవ భారత నిర్మాణానికి ముందుకు సాగుతున్నామన్నారు. అంతే, అంతకుమించి రామమందిర నిర్మాణం జోలికి ఆయన వెళ్లకపోవడం విశేషం! నిజానికి, ఈ ఏడాది జనవరి తరువాతి నుంచే రామమందిరంపై మోడీ పలుమార్లు మాట్లాడిన సందర్భాలున్నాయి. మందిర నిర్మాణం వేగవంతం చేస్తామంటూ చెప్పిన ఘటనలూ ఉన్నాయి. భాజపాకి అత్యంత ఆవశ్యకమైన ప్రచారాస్త్రాన్ని మోడీ ఎందుకు ప్రయోగించలేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయోధ్యలో రామమందిరం గురించి మాట్లాడకపోవడం కూడా ప్రత్యేకతగా మారింది!
ఇదే రోజున ప్రధానికి క్లీన్ చీట్ ఇచ్చిన అంశాన్నీ ప్రస్థావించుకోవాలి. హిందువులను కాంగ్రెస్ అవమానించిందనీ, అందుకే ఆ పార్టీని ప్రజలు శిక్షించాలనుకుంటున్నారని ఏప్రిల్ లో మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అయితే, ఆ వ్యాఖ్యలను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదని ఈసీ ఇవాళ్లే క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే, తాము ఇంతవరకూ ప్రధాని వైఖరిపై ఐదు ఫిర్యాదులు ఇస్తే, ఒక్కదానిపై మాత్రమే ఈసీ స్పందించిందంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈసీ తీరు మీద జరుగుతున్న చర్చ, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఫిర్యాదులు… ఇవన్నీ దృష్టి పెట్టుకునే అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశంపై ప్రధాని మాట్లాడ లేదని భావించొచ్చు!