ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్ర మోడీకి లేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానిపై మరోసారి విమర్శలు చేశారు. ఏపీని అన్ని రకాలుగా అణగదొక్కే ప్రయత్నమే గత ఐదేళ్లలో చేశారే తప్ప, ఒక్కటంటే ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. ఏపీలో వైకాపాకి మద్దతుగా మోడీ నిలబడ్డారనీ, ఎన్నికల సంఘం కూడా ఆ పార్టీకి మద్దతుగా నిలిచిందని సీఎం ఆరోపించారు. మోడీకి గుజరాత్ తప్ప, ఇతర రాష్ట్రాల గురించి అస్సలు పట్టదన్నారు. బీహార్ వెళ్లి, అక్కడి ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ప్రధానికి ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం మీద ప్రధామంత్రి, హోంశాఖ మంత్రి ఒక్కసారైనా సమీక్ష సమావేశం నిర్వహించారా అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని గుంటూరులో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారనీ, భాజపా సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ విషయంలో ఆయన చేసింది ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలను ఎగతాళి చెయ్యడానికే ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారన్నారు. ఏపీ హక్కుల కోసం తాము చేసిన ధర్మపోరాట దీక్షలకు అన్ని పార్టీల నుంచి మద్దతు వచ్చిందన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయడం మోడీకి మాత్రమే అలవాటన్నారు. తమ గురించి వెకిలిగా మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా తన స్థాయిని మోడీ దిగజార్చుకున్నారన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. నిన్నటివరకూ వ్యవ్థలను వాడుకుంటూ పరోక్ష దాడులు చేస్తున్నవారు, ఇప్పుడు ఏకంగా ప్రత్యక్షదాడులకు దిగుతున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇంతవరకూ ఒక్క భాజపా నాయకుడైనా ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
ప్రధాని స్థాయిలో ఉంటూ… పశ్చిమ బెంగాల్ కి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలను నేరుగా బెదిరిస్తున్నట్టే కదా అన్నారు. మోడీ హయాంలో తప్ప… గతంలో ఎప్పుడైనా ఆర్బీఐ, సీబీఐలాంటి సంస్థల మీద ఆరోపణలు వచ్చాయా అని ప్రశ్నించారు. ఆంధ్రా విషయంలో భాజపా శాశ్వత ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతుందని చంద్రబాబు అన్నారు. ఒకటైతే వాస్తవం… ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ప్రధాని స్థాయిలో మోడీ ప్రసంగాలు ఉండటం లేదు. ఓటరును ఏదో ఒకలా ఆకర్షించి గట్టేక్కేస్తే చాలన్నట్టుగానే తీరు కనిపిస్తోంది. అందుకే, కులం, మతం, స్థానికత, సైన్యం… ఇలాంటి అంశాలనే ప్రధాని ప్రచారం చేస్తున్నారు.