ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… ఒకే రోజున, ఒకే అంశంతో ఢిల్లీ వెళ్లాయి! ఆంధ్రాలో కడప ఉక్కు కార్మాగారం నెలకొల్పాలంటూ కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ని ఏపీ ఎంపీలు కలిశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయమై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు! విచిత్రం ఏంటంటే.. కొద్దిరోజుల తేడాలో సీఎం కేసీఆర్ కీ, మంత్రి కేటీఆర్ కీ ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం! ప్రస్తుతం దీక్ష చేస్తున్న ఏపీ ఎంపీ సీఎం రమేష్ దీక్షకు దిగడానికి ముందే ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే, కుదరదని చెప్పేశారు. కానీ, తెలంగాణ నేతలు అడగడమే ఆలస్యం టైమ్ ఇచ్చేశారు.
ప్రధానిని కేటీఆర్ కలవడాన్ని ఎవ్వరూ తప్పుబట్టడం లేదు! బయ్యారం ఫ్యాక్టరీ విషయమై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే, రాష్ట్రమే నిర్మించేందుకు ముందుకొస్తుందని కేటీఆర్ మీడియాతో ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందించారనీ, త్వరలోనే బయ్యారం విషయమై స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ దీక్షలు జరుగుతున్నా, ఏపీ ఎంపీలు ఢిల్లీలో మెరుపు సమ్మెకు రెడీ అవుతున్నా కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం విశేషం!
తమకు సానుకూలంగా ఉండే రాష్ట్రాల అధికార పార్టీల పట్ల ఒకలా, ప్రతికూలంగా మారిన ఆంధ్రాపై మరోలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చాలా స్పష్టంగా మరోసారి కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రెంట్ టాపిక్ ను ఈ మధ్య కేసీఆర్ పక్కన పెట్టేసినట్టుగా కనిపించేసరికి, రాజ్యసభలో డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికకి ఇతరుల మద్దతు భాజపాకి అవసరమయ్యేసరికి, తెరాస దగ్గర చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, తెలంగాణ విషయంలో మోడీ సానుకూలంగా ఉంటున్నారా లేదా అనేది ఇక్కడి చర్చ కాదు. ఏపీకి వచ్చేసరికి… కడప ఉక్కు కర్మాగారం మొదలుకొని కేంద్రం ఇవ్వాల్సిన ఇతర హామీలపై కేవలం రాష్ట్రాన్ని నిందించాలన్న ధోరణిలోనే మోడీ తీరులో ఉంటోంది.
ఒకేసారి విభజనకు గురై ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలతో రెండు రకాలుగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో బయ్యారం ప్లాంట్ పై కేంద్రం సానుకూలంగా ప్రకటన చేసి, శంకుస్థాపనకు ప్రధాని మోడీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీ ప్రభుత్వం తీరు బాగులేదు కాబట్టే కడప ప్లాంట్ రాలేదనీ, పక్క రాష్ట్రం తీరు బాగుంది కాబట్టే.. అదిగో అక్కడ ఇచ్చామనే ప్రచారం చేసుకోవాలన్న వ్యూహం భాజపాకి ఉన్నట్టుగా కనిపిస్తోంది.