మిజోరం అనే ఈశాన్య రాష్ట్రంతో కలుపుకుని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్లలో…కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడుతున్నాయి. మిజోరం, తెలంగాణల్లో బీజేపీ రేసులో లేదు. మిజోరం సంగతేమో కానీ.. తెలంగాణలో మాత్రం.. ఆ పార్టీ త్రిపురలా గెలిచేయబోతున్నామని ప్రకటించుంది. రామ్మాధవ్ లాంటి వాళ్లు.. త్రిపుర గురించి పదే పదే చెప్పుకుని చాతి పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సంగతి దేముడెరుగు.. గౌరవప్రదమైన ఓట్లు, సీట్లు తెచ్చుకోకపోతే… అందరు గేలిచేస్తారు. అందుకే ప్రధానమంత్రిని కూడా రంగంలోకి దించాలని.. బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. కానీ.. ఇక్కడా బీజేపీ నేతలకు చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. చంద్రబాబు ను విమర్శించడానికి నేరుగా పార్లమెంట్లో కేసీఆర్ను పొగిడారు. ఆ పొగడ్తల్ని కేటీఆర్… ఫ్రేమ్ కట్టించుకుని గోడకు అంటించుకున్నట్లుగా… ప్రతి సభలోనూ చెప్పుకుంటున్నారు. మరి మోడీ తెలంగాణ ప్రచారానికి వచ్చి ఏం చెబుతారు..? టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తారా..? ఒక వేళ విమర్శలు చేస్తే… పార్లమెంట్లో మోడీ చెప్పింది అబద్దలా అన్న విమర్శలు రాకుండా ఉంటాయి. ఒక వేళ ..టీఆర్ఎస్ను వదిలేసి.. మహాకూటమి.. కాంగ్రెస్ను టార్గెట్ చేస్తే.. అది టీఆర్ఎస్ – బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందాల్ని మరింత బహిర్గతం చేయదా..?. మోడీ మాటల మాంత్రికుడు కాబట్టి.. ఏం చెప్పినా చప్పట్లు కొడతారు కానీ.. తర్వాతైనా.. ఎఫెక్ట్ ఉంటుంది కదా..!. సరే ఏం మాట్లాడతారనేది పక్కన పెట్టినా.. అసలు సభలు ఎక్కడ పెట్టాలన్నది పెద్ద సమస్య అయిపోతోంది. కనీసం గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో పెడతాం.. ఫలితం ఉంటుందంటే.. ఒక్కటంటే.. ఒక్క నియోజకవర్గంలో కచ్చితంగా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఫలితాలొచ్చిన తర్వాత మోడీ ప్రచారం చేసినా డిపాజిట్లు రాలేదన్న విమర్శ తల తీసేసినట్లు ఉంటుంది.
అందుకే ప్రధాని మోదీ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలన్న దానిపై కమల దళంలో తర్జనభర్జన మొదలైంది. వచ్చే నెల 3, 5 తేదీల్లో రాష్ట్రానికి వస్తున్న ప్రధాని 3 సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకటి హైదరాబాద్లో జరుగుతుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో మిగతావి నిర్వహించాలనుకుంటున్నారు. వరంగల్లో ఒక సభ జరపాలని తొలుత భావించారు. ఆ పట్టణ పరిధి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలు అంతంతమాత్రంగానే ఉండటం, ప్రధాని ప్రచారంలో పాల్గొన్న చోట పార్టీ ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందన్న అభిప్రాయంతో ఆ ప్రతిపాదనను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. భూపాలపల్లిలో ఒకటి, నారాయణపేటలో మరో సభ నిర్వహించాలనుకున్నా భద్రత కారణాల దృష్ట్యా మారుమూల ప్రాంతాల్లో వద్దని ప్రధాని కార్యాలయం సూచించడంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. ఈ సమస్యలన్నీ ఎందుకు చివరికి ప్రధాని మోదీ ప్రచారం లేకుండా .. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్లతో సరిపెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా.. కొంత మంది వ్యక్తం చేశారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..! ?