హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవసభలో మాట్లాడిన ప్రధాని మోదీ కవిత లిక్కర్ కేసు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. లిక్కర్ కేసులో కొంత మందిని వదిలేశామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని… కానీ ఎవర్నీ వదిలేది లేదని చెప్పుకొచ్చారు. వదిలేసిన విషయం కళ్ల ముందే ఉంది. అయినా కేసులు, దర్యాప్తులు… తామే ప్రభావితం చేస్తున్నట్లుగా మోదీ అంగీకరించినట్లుగా అవసరం వచ్చినప్పుడు అరెస్టు చేస్తామన్నట్లుగా హెచ్చరికలు జారీ చేశారు. దర్యాప్తు సంస్థలు మోదీ , బీజేపీ కనుసన్నల్లో ఉంటాయని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి పరుల్ని వదిలి పెట్టబోమని భీకరమైన డైలాగుల్ని మోదీ తెలుగు గడ్డపై చెప్పడం మాత్రం కామెడీ అవుతుంది. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న అడ్డగోలు అవినీతి గురించి సొంత పార్టీ అధ్యక్షురాలు లేఖలు రాసి.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఆర్థిక ఉగ్రవాది లాంటి జగన్ రెడ్డి చేస్తున్న ఆర్థిక అరాచకాలకూ అంతే లేదు. ఏపీని దివాలా తీయించేదాకా నిద్రపోవడం లేదు. అడిగినన్ని అప్పులు ఇచ్చి… ప్రోత్సహిస్తున్నారు. వీటన్నింటిపై సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తే జగన్ రెడ్డిని వెనకేసుకు వస్తూ నిర్మలా సీతారామన్ వంటి వారు ప్రకటనలు చేసి… సొంత పార్టీ వాళ్లను కించ పరుస్తారు కానీ..కనీసం విచారణ చేయించరు.
పదేళ్లుగా బెయిల్ పై ఉండి.. కనీసం కేసులు ట్రయల్స్ కు రాని పరిస్థితి ఎందుకు ఉంటుందో మోదీ చెప్పలేరు. పొరుగు రాష్ట్రం సంగతి పక్కన పెడితే.. తెలంగాణలో కాళేశ్వరం పేరుతో అతిపెద్ద స్కాం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ కీలకమైన బ్యారేజీకి పగుళ్లిచ్చాయి. కుంగిపోయింది. కేంద్రం నివేదిక ఇచ్చింది. కానీ సభలో ఆ అవినీతిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి మోదీ ఎలాంటి అవినీతి పరుల్ని సహించరు.
మోదీ అవినీతిని సహించరు… కాకపోతే అది తమ పార్టీ లేదు.. తమ పార్టీ మద్దతుగా ఉన్న వారి విషయంలో కాదు. ఇతర పార్టీ లకు చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా సరే అరెస్టులు చేయించడం కామన్. అదే మోదీ సహించలేని అవినీతి…రాజనీతి.