రెండువందల ఏళ్ల పరిపాలనతో భారతదేశపు అణువణువునా బ్రిటిష్ పాలకులు తమ ముద్రను విడిచిపెట్టారు. ఇప్పటికీ మన దేశంలో ఏ మూల ఏ పని జరుగుతూ ఉన్నా.. ఇదే బ్రిటిష్‌కాలంలో అయితేనా.. అంటూ పెదవివిరిచేవారు కనిపిస్తారు. అలాగే ఇది బ్రిటిషోళ్లు చేసిన పని.. మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం అని చెప్పుకోడానికి ప్రతిచోటా కొన్ని ముద్రలు, ఆనవాళ్లు అలా దేశమంతా మిగిలిపోయి ఉన్నాయి. ఒకటారెండా రెండు వందల ఏళ్లు.. మన దేశసంపదనంతా కొల్లగొడుతూ వారు మన జీవితాల మీద అనేకానేక ముద్రలు మిగిల్చివెళ్లారు. అయితే మన ప్రధాని నరేంద్రమోడీ.. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్‌కు రెండు నిమిషాల పాటు ఇచ్చిన షేక్హ్యాండ్తోనే ఆయన మీద తన ‘ముద్ర’ను వేయగలిగారు. యువరాజు చేతి మీద మన ప్రధాని చేతి వేళ్ల ముద్ర అచ్చయిపోయిదంటే అతిశయోక్తి కాదు… అదెలా జరిగిందా అనుకుంటున్నారా?
ప్రస్తుతం ప్రిన్స్ విలియమ్స్ దంపతులు భారత పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టూరులో భాగంగా వారు మర్యాదపూర్వకంగా ప్రధాని నరేంద్రమోడీని కూడా కలిసి ఆయన ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ – ప్రిన్స్ విలియమ్స్‌తో కరచాలనం చేశారు. ఆయన ఎంత దృఢంగా, పటిష్టమైన కరచాలనం చేశారంటే ఆయన ప్రిన్స్ విలియమ్స్ చేతిని వదలిపెట్టేసరికి.. అసలే ఎర్రగా పాలమీగడలాగ మెరిసిపోతూ ఉండే ప్రిన్స్ విలియమ్స్చేతుల మీద మోడీ చేతివేళ్లు ముద్ర పడిపోయాయి. ఈ సందర్భంగా తీసిన వీడియోలోనూ, ఫోటోల్లోనూ కూడా ప్రిన్స్ విలియమ్స్ చేతిపై మోడీ చేతి ముద్ర స్పష్టంగా ప్రింట్ అయినట్లు పడడం విశేషం.
మనల్ని బానిసలుగా పరిపాలించి మన దేశాన్ని, సంస్కృతిని అన్నిటినీ దోచుకున్నందుకు ప్రతీకారంగానా అన్నట్లు మోడీ ఏకంగా యువరాజు మీదే తన ముద్రను విడిచిపెట్టారని అంతా జోకులేసుకుంటున్నారు.