ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు! ఉత్తరప్రదేశ్ లో జరిగిన ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి, అక్కడ తీవ్రవాదులను మట్టుబెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. గడచిన ఐదేళ్లలో దేశంలో తీవ్రవాదాన్ని కట్టడి చేశామన్నారు. బాంబు దాడుల్ని కూడా పూర్తిగా అరికట్టామన్నారు. రెండు విడతలు ఎన్నికలయ్యేసరికి, తనని విమర్శించేవారు నీరసపడుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రెండు దఫాలు ఎన్నికలయ్యేసరికి వారి ముఖాలు చిన్నగా మారిపోయాయనీ, నిద్రలు పట్టకుండా పోయాయనీ, గొంతులు పడిపోయాయంటూ ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ! గడచిన రెండు విడతల్లోనూ మరోసారి మోడీ సర్కారు రావాలని ప్రజలు తీర్పు చెప్పారని అన్నారు.
దేశం దమ్మేంటో చూపించినవారికీ, దేశాన్నీ తాకట్టుపెట్టేవారికీ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. దేశంలో పటిష్టమైన ప్రభుత్వాన్ని నెలకొల్పేవారికీ, బలహీనమైన పాలన అందించాలనుకుంటున్నవారికీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవనీ మోడీ అన్నారు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దమ్ము ఏంటనేది కనిపిస్తోందా లేదా అని ప్రజలను ప్రశ్నించి, అవును అనిపించారు మోడీ. ప్రపంచదేశాలన్నీ భారతదేశాన్ని మెచ్చుకుంటున్నాయా లేదా అని ప్రశ్నించి, అవును అనిపించారు! పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి, తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఎవరూ… అంటూ, జనాలతో జేజేలు కొట్టించారు మోడీ.
ఆయన ప్రసంగంలో ఎక్కువ భాగం దేశ సరిహద్దులకు అవతల యుద్ధం చేశామనీ, ప్రపంచదేశాలు మన బలాన్ని గుర్తించాయనీ, ఇతర దేశాలు మన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాయి… ఇలాంటి పరిస్థితులకే ప్రాధాన్యం కనిపించింది! అంతేగానీ, దేశంలోపలి పరిస్థితులపై ఆయన మాట్లాడటం లేదు. దేశంలో పేదరికం ఏంటి, నిరుద్యోగ సమస్య ఏమైందీ, వ్యవసాయం పరిస్థితి ఏంటి, మెరుగైన జీవన ప్రమాణాలేవీ, ఓవరాల్ గా… ఐదేళ్లలో మోడీ సాధించింది ఏంటో మోడీ చెప్పడం లేదు. సైన్యం, పాకిస్థాన్, దేశభక్తి, ప్రపంచదేశాల కీర్తి… ఇవి ఎన్నికల ప్రచారాంశాలా..? ఇంకోటి… గడచిన ఐదేళ్లలో దేశంలో బాంబుదాడులను లేకుండా చేశామని గొప్పగా చెబుతున్నారు. మరి, పుల్వామాలో జరిగింది ఏంటి..? మన సైనికులు మరణానికి కారణం నిఘా వైఫల్యం కాదా..? అయినా, సర్జికల్ స్ట్రైక్స్ గానీ, ఇతర సైనిక చర్యలు ఏవైనా సరే, ఇవేమన్నా ప్రభుత్వ పథకాలా.. అదంతా తాము చేసిన ఘనతగా చెప్పుకోవడానికి?