ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఆగస్టు 7న ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొటారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలాన్ ను ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామగుండం ఎన్టీపీసీలో 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తారు. రామగుండంలోనే ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు. సింగరేణి సంస్థకు చెందిన 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు. వరంగల్ లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు.
తెలంగాణ పర్యటనలో మోడీ కోసం బిజీ షెడ్యూల్ ఎదురు చూస్తోంది. గజ్వేల్ లో ఘనంగా జరిగే కార్యక్రమాల సంద్భంగా మోడీ ఏమైనా హామీలిస్తారేమో అని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పాటు మరిన్ని పథకాలకు భారీగా నిధులు ఇవ్వాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
గురువారం లోక్ సభలోనూ తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి మిషన్ భగీరథకు ఏమేరకు సహాయం చేస్తారని ప్రభుత్వాన్ని అడిగారు. ఆ పథకం చాలా గొప్పదని సదరు మంత్రి గారు మెచ్చుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇచ్చేది ఏమీ లేదని చెప్పారు. భవిష్యత్తులో ఏంచేయాలో ఆలోచిస్తామని సమాధానమిచ్చారు.
దీన్ని బట్టి, కేంద్ర ప్రభుత్వ సహాయంపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని స్పష్టమవుతోంది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ ఏమిస్తారోనని ప్రజలు ఆశగా ఎదురు చూశారు. చివరకు మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లారు. దీనిపై దుమారం రేగింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. మరి తెలంగాణకు నిధులు ఇస్తామని స్పష్టమైన హామీఇస్తారో లేక ఉత్త చేతులతో తిరిగి వెళ్తారో… చూద్దాం.