“ఎన్నికల సమయంలో ఏవేవో చెబుతాం.. అన్నీ చేయడం సాధ్యం అవుతుందా..? అది కూడా అలాంటిదే..! అదో జుమ్లా..!”… భారతీయ జనతా పార్టీకి మోడీకి ఎదురు లేదని భావిస్తున్న సమయంలో అమిత్ షా నోటి వెంట దాదాపుగా ఏడాది క్రితం వచ్చిన ఈ మాటలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ మాట అన్నది.. బ్లాక్ మనీ తెస్తాం.. ప్రతి ఒక్కరికీ రూ. 15 లక్షలు ఇస్తామని మోడీ ఇచ్చిన హామీ గురించి. అయినప్పటికీ.. అమిత్ షా.. తాము అమలు చేయని హామీలన్నింటికీ.. వర్తింప చేశాలా.. ” జుమ్లా ” అనేశారు. అప్పటి నుంచి బీజేపీ నేతలు చెప్పేవాటిని ప్రజలు .. అలాగే చూస్తున్నారు కానీ.. సీరియస్‌గా చూడటం లేదు. ఇప్పుడు ఎన్నికలు ముంగిటకు వచ్చేయడంతో… బీజేపీతో పాటు.. ఆ పార్టీ మిత్రపక్షాలు కూడా.. ఎలాగోలా గట్టెక్కడానికి “జుమ్లా”ల మీద ఎగబడుతున్నారు. ఆ పదిహేను లక్షల టాపిక్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆ మొత్తం ఒక్క సారే కాదు.. కొద్దికొద్దిగా అయినా మోడీ ఇస్తారంటూ.. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ప్రకటించారు.
మహారాష్ట్రకు చెందిన రాందాస్ అథవాలే బీజేపీ నేత కాదు. కానీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు. ఆ పార్టీ తరపున ఆయన తప్ప మరొక ఎంపీ లేరు. ఒకే ఒక్క ఎంపీ ఉన్న పార్టీ అయినప్పటికీ.. ఆయన కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అందుకే ఆయన మోడీని తెగ మోసేస్తూంటారు. ఈ క్రమంలో ఎన్నికల హామీల అమలు విషయంలో.. మోడీ చేతకాని తనాన్ని పక్క వాళ్లపై నెట్టేయడానికి బీజేపీ నేతల కన్నా ఎక్కువగా తాపత్రయ పడుతున్నారు. రూ. 15 లక్షలు మోడీ ఇద్దామనుకున్నా.. ఆర్బీఐ ఒప్పుకోలేదని అంటున్నారు. మోడీ ఇవ్వాలనుకుంటే.. ఐర్బీఐ ఎందుకు ఇవ్వదు అనే .. సందేహం వస్తుంది కాబట్టి.. దానికి కూడా ఆయనే సమాధానం ఇస్తున్నారు.. అదేమిటంటే… ఆర్బీఐ వద్ద ఉన్న డబ్బులు ఇస్తేనే కదా… మోడీ పంచేది అని. అంటే.. ఆర్బీఐ వద్ద రిజర్వ్ ఉన్న నిధుల్ని మోడీ పంచాలనుకున్నారు.. అందుకు..ఆర్బీఐ అంగీకరించలేదన్నమాట. అందుకే మోడీ ఇవ్వలేదని.. కొద్దికొద్దిగా ఇస్తారని కూడా.. కవర్ చేసుకుంటున్నారు.
ఎన్నికలు ముగిసి… ప్రధానిగా మోడీ అయిన తర్వాత.. దేశం పడిన ఇబ్బందులు .. అన్నీ ఇన్నీ కావు. ఈ ఇబ్బందులు మోడీ తెచ్చి పెట్టినవే. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి వాటిపై ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా .. రూ. 15 లక్షలు రాబోతున్నాయనే ఆశ చూపించారు. తర్వాత జుమ్లా అన్నారు. ఇప్పుడు మరో రకంగా స్పందిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి…కాబట్టి.. త్వరలో అందరికీ చెక్కులు జారీ చేసి.. ఓట్లేసి.. డ్రా చేసుకోండి.. అని ప్రకటన చేసినా… ఆశ్చర్యం లేదన్న మాట.. తాజాగా బీజేపీ నేతల్లోనే సెటైర్లుగా వినబడుతోంది.