“ఒకే ఒక్క ఆపాయింట్మెంట్..” అంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బాధలు.. తన రాష్ట్ర బాధలు చెప్పుకునేందుకు పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి అని… సమాచారం వస్తేనే.. ఆయన ప్రత్యేక విమానం వేసుకుని హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత గుమ్మం ముందు నిలబెట్టారు కానీ.. పది నిమిషాలు సమయం కేటాయించలేదు. అమిత్ షా అయితే.. సమయం ఇచ్చారు కానీ..అది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పించుకోవడానికి మాత్రమే. ఒకటి కాదు రెండు సార్లు ఇలాంటి అవమానాలను ఏపీ సీఎం ఎదుర్కొన్నారు. చివరికి మొన్నటికి మొన్న.. అమరావతి విషయంలో.. ఓ మాట చెప్పేందుకు.. తాను రెడీ అని.. ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమని చెప్పుకున్నారు. తన అధికారులుతో… పార్టీలో నెంబర్ 2.. ఏపీ సర్కార్ తరపున ఢిల్లీలో పెద్దగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి ద్వారా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నా… అపాయింట్మెంట్ మాత్రం ఖరారు కాలేదు.
అయితే వైసీపీలో.. జగన్ తర్వాత.. ఏదో వందో.. రెండు వందల స్థానంలోనే ఉండే.. మోహన్‌బాబుకు మాత్రం.. మోడీ సమయం ఇచ్చారు. ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంత పెద్ద నేత అయినా.. మోడీతో అపాయింట్మెంట్ అరగంట వరకూ ఉంటుంది. ముఖ్యమంత్రులయితే… అరగంటకుపైగా కేటాయిస్తారు. కానీ.. మోహన్ బాబు.. వైసీపీలో ఓ చోటాలీడర్ మాత్రమే. కనీసం నామినేటెడ్ సోస్టు కూడా.. దక్కించుకోలేకపోయిన నేత. అలాంటి నేతకు.. ముప్పావు గంట సమయం ఇచ్చారు. అన్నీ మాట్లాడారు. జగన్ అడుగుతున్నా.. పట్టించుకోని మోడీ… మోహన్‌బాబుకు మాత్రం అంత ప్రయారిటీ ఎందుకిచ్చారన్నది చాలా మందికి అర్థం కాని విషయం.
నిజానికి.. బీజేపీ స్టైల్ ఆఫ్ డీలింగ్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయని.. గతం నుంచీ చూస్తున్నామని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సంబంధాలు చెడిపోయే దశలో.. మోడీ ఇలాంటి గేమ్ ఆడారు. రాష్ట్ర సమస్యల కోసం.. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ.. లక్ష్మిపార్వతి నుంచి విజయసాయిరెడ్డి వరకూ అందరికీ అపాయింట్మెంట్ దొరికేది. చంద్రబాబును పొలిటికల్‌గా దూరం పెడుతున్నామనే సందేశం పంపాడానికి ఆయన ఇలా చేశారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు.. జగన్ విషయంలోనూ.. అదే జరుగుతోందా.. అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఎలా చూసినా.. జగన్ కన్నా… మోహన్‌బాబుకు మోడీ అత్యంత ప్రయారిటీ ఇవ్వడం.. మాత్రం సాధారణంగా తీసుకోవాల్సిన అంశం కాదంటున్నారు.