భారతీయ జనతా పార్టీకి నిన్నామొన్నటి దాకా రాఫెల్ డీల్ చాలా పెద్ద చిక్కుముడి. సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌తో ఎలాగోలా ఎదురుదాడి చేస్తున్నామని… సంతోష పడుతోంది కానీ… మరో వైపు మరో పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. అదే రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో గెలవడం… రుణమాఫీ ఫైళ్లపై సంతకాలు పెట్టడంతో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గగ్గోలు రేగింది. అక్కడి రైతుల్లో కదలిక ప్రారంభమయింది. అదే సమయంలో.. రాహుల్ గాంధీ.. మోడీని మరింత ఇబ్బందుల్లో పెట్టేందుకు.. పదే పదే కార్పొరేట్ కంపెనీలకు చేసిన రుణమాఫీని… రాఫెల్ డీల్‌లో ఏకపక్షంగా రూ. 35వేల కోట్లు అంబానీకి కట్టబెట్టిన వైనాన్ని గుర్తు చేస్తూ.. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి బలంగా ప్రజల్లోకి వెళ్తూండటంతో బీజేపీ చిక్కుల్లో పడిపోతోంది.
భారతీయ జనతా పార్టీ .. మిత్రపక్షాలతో కలిసి పందొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎక్కడా రుణమాఫీ అమలు చేయడం లేదు. కానీ ఆయన రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. యూపీలో రుణమాఫీ హామీ ఇచ్చారు కానీ.. ఎంత మేర అమలు చేశారో క్లారిటీ లేదు. రుణమాఫీ కోసం మూడు నెలలకో సారి మహారాష్ట్ర రైతులు మహోద్యమం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ హామీని అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అర్హుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేలా.. నిబంధనలు పెట్టడంతో రైతులు రగిలిపోయారు. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్నింటిలోనూ.. ఇదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ కూడా.. రుణమాఫీ చేసే వరకు మోదీని ప్రశాంతంగా నిద్రపోనివ్వను అంటూ సవాల్ చేస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో ముఖ్యంగా ఉత్తరాదిన ఈ డిమాండ్‌ను కమలం సర్కార్లకు చెమటలు పట్టిస్తోంది. గుజరాత్ లో ఏళ్ల తరబడి బీజేపీ అధికారంలో ఉంది. కానీ చేసిందేమీ లేదు. ఈ అసంతృప్తి బయటపడే పరిస్థితి రావడంతో.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ బకాయిలను ఉన్న పళంగా మాఫీ చేసింది. 650 కోట్ల రూపాయలను మాఫీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విజయంతో అక్కడి రైతులు రుణమాఫీ కోసం ఉద్యమం చేసే ఆలోచనలో ఉన్నారు. ఇతర బీజేపీ రాష్ట్రాలు ఇదే ఒత్తిడిలో పడిపోయాయి. నిజానికి రుణమాఫీ కాంగ్రెస్ మార్క్ బ్రాండ్. గతంలో మన్మోహన్సింగ్ 75 వేల కోట్ల రుణమాఫీ చేశారు. సిద్ధరామయ్య 9 వేల కోట్ల రుణమాఫీ చేయగా.. కుమారస్వామి అదే బాటలో నడుస్తున్నారు. ఇపుడు కమల్‌నాథ్. అంతేకాదు… మిగతా రాష్ట్రాల్లోనూ రుణమాఫీ చేస్తారా…? తాము అధికారంలోకి వచ్చాక చేయమంటారా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. అందుకే ఇపుడు బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ఏదో నిర్ణయం తీసుకోకపోతే.. ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమన్న భావన బీజేపీలో ఏర్పడుతోంది.