ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జులై మొదటి వారంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మూడు అంశాల ప్రాతిపదికన మార్పులు, చేర్పులు చేయబోతున్నారు. ఒకటి- పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించడం. రెండు- కొందరు మంత్రులను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించడం. మూడు- వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వీలైనంత మందిని కేబినెట్లోకి తీసుకోవడం.
ఈ ప్రాతిపదికన మంత్రివర్గం కూర్పు ఉండబోతోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో దీనిపై మోడీ చర్చించారని తెలుస్తోంది. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు ఉద్వాసన తప్పక పోవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ వాణిని బలంగా వినిపించడం, జాతీయ చానళ్లలో విపక్షాల దాడిని తిప్పికొట్టడానికి ఆమెకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారట.
ఇలా మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే వారి జాబితాలో సికింద్రాబాద్ ఎంపీ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై అమిత్ షా సీరియస్ గా ఉన్నారు. గత రెండేళ్లుగా తెలంగాణలో పార్టీని మెరుగుపరచడానికి జరిగిందేమీ లేదని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి సమర్థంగా పనిచేయలేదన్నది అమిత్ షా అభిప్రాయం. ఇప్పుడు ఆయన స్థానంలో లక్ష్మణ్ ను నియమించారు. అయితే ఆయన తనదైన శైలిలో పనిచేస్తూ పార్టీని గాడిలో పెట్టడానికి కొంత సమయం పట్టవచ్చు.
తెలంగాణలో పార్టీకి ఊపు రావాలంటే సీనియర్ నేతలు గట్టి ప్రయత్నం చేయాలని ఇప్పటికే అమిత్ షా ఉద్బోధించారు. అయినా పెద్దగా మార్పు లేదని ఆయన నిరాశతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, వచ్చే నెల మొదటి వారంలో జరిగే మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో దత్తాత్రేయ మంత్రి పదవి అలాగే ఉంటుందా లేక మార్పు జరుగుతుందా అనేది చర్చనీయాంశమైంది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఒక కేంద్ర మంత్రి ఉండాలనేది ఒక వాదన. బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉన్న అలాంటి వ్యక్తిని, మాస్ లీడర్ ను పార్టీ బాధ్యతల కోసం ఉపయోగించు కోవాలనేది మరో వాదన. ఇంతకీ దత్తన్న మంత్రిగా కొనసాగుతారా లేదా అనేది జులై మొదటి వారంలో తెలిసిపోతుంది.