భాజపాకి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినందుకు తెదేపాకి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఒక గవర్నర్ పదవి లేదా ఒక కేంద్ర సహాయమంత్రి పదవి+ కొన్ని నామినేటడ్ పదవులు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించినట్లు తెలుస్తోంది. తెదేపా గవర్నర్ పదవితో బాటు సహాయమంత్రి పదవి, నామినేటడ్ పదవులను కోరుతున్నట్లు తాజా సమాచారం. నిజానికి భాజపాకి రాజ్యసభ సీటు కేటాయించక మునుపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బేరం పెట్టినట్లు సమాచారం. బహుశః అదే ఇప్పుడు కార్యారోపోపం దాల్చుతోందేమో? తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు చాలా కాలం క్రితమే హామీ ఇచ్చారు. కనుక ఒకవేళ గవర్నర్ పదవి తీసుకొన్నట్లయితే దానిని ఆయనకి ఇవ్వవచ్చు. తెదేపా తరపున రాజ్యసభకి ఎంపికైన టిజి వెంకటేష్, కేంద్ర సహాయమంత్రి పదవి కోసం అప్పుడే పైరవీలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయనకీ రాజ్యసభ సీటు ఇప్పించేరు కనుక, కేంద్ర మంత్రి పదవి కోసం కూడా అయన ద్వారానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
భాజపాకి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా మళ్ళీ కేంద్రంతో తెదేపా సంబంధాలు బలపడటమే కాకుండా, రైల్వే మంత్రి రాష్ట్రానికి కొన్ని కోట్లు విలువగల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెదేపా-భాజపాల సంబంధాలు తెగిపోయే పరిస్థితికి వచ్చిన సమయంలో రాజ్యసభ ఎన్నికల కారణంగా మళ్ళీ రెండు పార్టీల మద్య బంధం ఈవిధంగా బలపడటం విశేషమే. మరో విశేషం ఏమిటంటే, భాజపా అధ్యక్షుడు అమిత్ షా తెరాస అడగకపోయినా అది కోరుకొంటే ఎన్డీయే కూటమిలో చేర్చుకొని కేంద్ర మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేస్తే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ద్వందంగా తిరస్కరించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరిస్తూ పదవులు, ప్రాజెక్టులు రెండూ సాధించుకొంటున్నారు. అయితే రాజధాని నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకి అదనపు నిధులు మంజూరు చేయమని కేంద్ర ఆర్ధిక శాఖ తెగేసి చెప్పడం జీర్ణించుకోవడం కష్టమే. అలాగే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం వైఖరి పట్ల అందరిలో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తెదేపా తన ఇద్దరు కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని కాంగ్రెస్, వైకాపాలు డిమాండ్ చేస్తుంటే తెదేపా అదనంగా మరికొన్ని పదవులు తీసుకొంటే తెదేపా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా కేవలం తన పార్టీ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటోందని ప్రతిపక్షల నుంచి విమర్శలు రాకమానవు. కానీ అటువంటి విమర్శలని ఇదివరకే పట్టించుకోని తెదేపా ఇప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకొంటుంది?