ఈనెల 26వ తేదీ నుండి డిశంబర్ 22వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఈ రోజు నిర్ణయించింది. ఇంతకు ముందు జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేల రాజీనామాలకు, వ్యాపం కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామాలకు పట్టుబడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉభయ సభలలో ఎటువంటి చర్చ జరగనీయకుండా పార్లమెంటుని స్తంభింపజేసాయి. ఈసారి బిహార్ ఎన్నికలలో బీజేపీని చావుదెబ్బ కొట్టి ఏకంగా 27సీట్లు గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహంతో ఉరకలేస్తోంది.
“బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో రచయితలపై దాడులు, మత అసహనం పెరిగిపోతోంది” అంటూ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు చేసిన ప్రచారానికి ప్రభావితమయిన అనేకమంది ప్రముఖులు, రచయితలు, కళాకారులు తమ అవార్డులను కేంద్రప్రభుత్వానికి వాపసు చేస్తుండటం, ఉత్తర ప్రదేశ్ లో మైనార్టీ వర్గాల మీద జరిగిన దాడులు వంటి అనేక అంశాలను అస్త్ర శస్త్రాలుగా చేసుకొని మోడీ ప్రభుత్వంపై దాడి చేయడానికి కాంగ్రెస్ చాలా ఎదురుచూస్తోంది. కనుక ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని దాని మిత్రపక్షాలను ఎదుర్కోవడం మోడీ ప్రభుత్వానికి చాలా కష్టం కావచ్చును. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దానికి పార్లమెంటులో ఎదురుపడాలంటే కాంగ్రస్ చాలా భయపడేది. అందుకే లోక్ సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్దేదుకు రాహుల్ గాంధీ నిరాకరించి, వెనుక బెంచీలలో కునుకు తీసేవారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి వ్యతిరేకమయిన పరిస్థితి కనిపిస్తోంది. తమ ప్రభుత్వంపై ముప్పేట దాడులు చేస్తున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక మోడీ ప్రభుత్వం దిగులు పడుతోంది.