చారిత్రకం, అద్భుతం, అమోఘం, నభూతో న భవిష్యతి.. ఇలా చాలా కబుర్లు చెప్పారు. స్వతంత్రం వచ్చాక దేశాన్ని ఈ స్థాయిలో అభివృద్ధివైపు పరుగులు తీయించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదని జబ్బలు చరుకున్నారు. అవినీతిపై ఉక్కుపాదం, నల్లధనంపై పాశుపతం, ఉగ్రవాదంపై ఉగ్రనేత్రం.. ఇలాంటి కబుర్లు చాలాచాలా చెప్పారు. 120 కోట్ల భారతీయులపై పెద్ద నోట్ల రద్దు అనే గుదిబండ తోశారు. ఇంకా వెన్ను విరగలేదేమో అన్న అనుమానంతో జీఎస్టీ అంటూ మరో మేకు దిగ్గొట్టారు! ఇవన్నీ గడచిన ఏడాది కాలంలో మోడీ సర్కారు సాధించిన ఘన విజయాలని వారు చెప్పుకుంటున్నారు. సరే.. ఏడాది గడిచేసరికి తత్వం బోధపడుతున్నట్టుగా ఉంది. ఒక్క త్రైమాసికం చాలు… ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడిపోతుందని అప్పట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నమ్మకంగా చెప్పారు. మాసికాలు దాటిపోయి సంవత్సరికం పెట్టాల్సిన తరుణం వచ్చేసిందిప్పుడు! కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్ ఇదే సంకేతాలను ఇస్తోంది. యోధానయోధులైన ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులు, సలహాదారులు, ఆర్థికవేత్తలు అందరితో సమావేశం పెట్టారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై క్షుణ్ణంగా సమీక్ష చేశామని ఆర్థికమంత్రి చెప్పారు. సుదీర్ఘకాలంలో భారీ ప్రయోజనాలు ఆశిస్తున్నప్పుడు, తాత్కాలికంగా ఇలాంటి ఎగుడుదిగుడులు సహజమే అన్నారు. అన్ని రకాల అభివృద్ధి సూచికలు చూసుకుంటే గడ్డు కాలం గడిచిపోయిందని తెలిపారు. రాబోయే త్రైమాసికాల్లో అద్భుతమైన వృద్ధి రేటు సాధించబోతున్నాం అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గిందీ, ప్రభుత్వ బ్యాంకులకు పెద్ద ఎత్తున నిధులను పెట్టుబడుల కింద ఇవ్వబోతున్నామనీ, దీంతో వ్యాపారాలూ పరిశ్రమలూ అన్నీ వర్గాలు అభివృద్ధి కాబోతున్నాయన్నారు. భవిష్యత్తు బంగారం కాబోతోందన్న భరోసాను నింపే ప్రయత్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపడుతున్న చర్యల్ని వివరించారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ… ఈ రెండూ అనాలోచిత నిర్ణయాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టుగా ఆర్థిక సంస్కరణల విషయంలో కూడా మెరుపు నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుందో ఇన్నాళ్లకు మోడీ సర్కారుకు అర్థమౌతోంది. ఈ భారీ సమావేశం లక్ష్యం ఏంటంటే… భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు భరోసా కల్పించడం. అంటే, వర్తమానం అస్తవ్యస్థంగా ఉందని ఒప్పుకుంటున్నట్టే కదా. చారిత్రకం అనుకుని తాము తీసుకున్న నిర్ణయాల వాస్తవ ప్రభావం ఏంటో మోడీ సర్కారుకు అర్థమైందని చెప్పుకోవచ్చు. కానీ, ఏం ప్రయోజనం..? జరగాల్సిందంతా జరిగిపోయింది. నోట్ల రద్దు ప్రకటించి ఏం సాధించారో ఏడాదిగా చెప్పలేకపోతున్నారు. ఇక, జీఎస్టీ.. అదో బ్రహ్మపదార్థంగా మారింది. ఆరు రకాల శ్లాబులు అర్థం కాక వ్యాపారులు, పన్నుల భారం భరించలేక ప్రజలూ పూర్తిగా గందరగోళ పడుతున్నారు. కేంద్రంలో భాజపా సర్కారుకు ఆ వేడి బాగా తగులుతోందన్నది వాస్తవం. అందుకే, ఈ ఉద్దీపన చర్యలు. మరి, ఈ చర్యల ఎంతవరకూ వ్యవస్థను గాడిలోకి తెస్తాయో వేచిచూడాలి.
ఇప్పుడు చేస్తున్న ఈ కసరత్తే నోట్ల రద్దు నిర్ణయానికి ముందుగానీ, జీఎస్టీ అమలుకు ముందుగానీ చేసి ఉంటే బాగుండేది. ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయాలన్న లక్ష్యంతో ఆర్థిక సంస్కరణల అమలు నిర్ణయాలు తీసుకుంటే ఎలా..? ఎన్నికలకు ఏడాదిన్నరే సమయం ఉంది. ఈలోగా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అది సెమీ ఫైనల్స్. కాబట్టి, ఈలోగా ఆర్థిక వ్యవస్థను ఎంతోకొంత గాడిలో పెట్టకపోతే.. భాజపాకి అచ్ఛే దిన్ ఫిర్ కభీనహీ ఆయేగా! అందుకే, ఇప్పుడీ తత్తరబాటు. ఈ ప్రహసనం అంతా ఎలా ఉందంటే.. ఇంటి చూరుకి నిప్పు పెట్టేసి, కాళ్లు వణుకుతున్నాయని భయపడ్డట్టుగా ఉంది!