ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పలికిన మాటలు వింటుంటే అలనాటి ‘సతీ సావిత్రి’ సినిమాలో యమధర్మరాజు పలికిన ‘సావిత్రీ ఏదయినా మరొక్క వరం కోరుకో…పతి ప్రాణంబులు తప్ప” అనే పాపులర్ డైలాగ్ టక్కున గుర్తుకు వస్తే అది ప్రజల తప్పు కాదు. భర్త ప్రాణాల కోసం యమధర్మ రాజు వెంటపడిన సతీ సావిత్రిలాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి తాడోపేడో తెల్చేసుకొంటానని శపథం చేసి డిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు మళ్ళీ మరో ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసారు. ఆయన కూడా మళ్ళీ యధాప్రకారం, “బాబూ ఆ ఒక్కటీ తప్ప మరేదయినా మాట్లాడు.. విజయవాడ తిరిగి వెళ్ళడానికి దైర్యం చాలకపోతే నీతి ఆయోగ్ వాళ్లకి చెప్పి మంచి రోడ్డు మ్యాప్ గీయించి ఇస్తాను,” అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక చేతిలో ఉన్న బొకేని ఆయన చేతిలో పెట్టి మొహానికి నవ్వు అతికించుకొని బయటపడ్డారు చంద్రబాబు నాయుడు. ఆ తరువాత మోడీ తనకు చెప్పిన ఆ నాలుగు ముక్కలు అరుణ్ జైట్లీ చేతనే మీడియాకి చెప్పించారు.. ప్రత్యేక హోదా విషయంలో తన ప్రయత్న లోపం, తప్పు ఏమీ లేదని నిరూపించేందుకు.
బహుశః జేసీ దివాకర్ రెడ్డి మళ్ళీ సీన్లోకి వచ్చి “నేను ఆనాడే చెప్పాను కదా? ప్రత్యేక హోదా రాదని…ఆ సంగతి చంద్రబాబు నాయుడు ముందే తెలుసనీను…ఈ జనాలతో, ప్రతిపక్షాలతో వేగలేకనే ఆయన డిల్లీ వెళ్ళారు తప్ప మరొకందుకు కాదు,” అని చెప్పడం తధ్యం. “ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వనప్పుడు ఇంకా మోడీ ప్రభుత్వాన్ని పట్టుకొని ఎందుకు వ్రేలాడుతున్నారు? వెంటనే మీ ఇద్దరు మంత్రులను బయటకి పుల్లింగ్ చేసేసి బీజేపీతో దోస్తీకి ‘రామ్ రామ్’ చెప్పేయోచ్చు కదా?” అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీయవచ్చును. వీలయితే బాబూ నువ్వు కూడా రాష్ట్ర బంద్ కి ఓ చెయ్యి వెయ్యి అని రిక్వెస్ట్ మెసేజ్ పెట్టినా ఆశ్చర్యం లేదు.
“చూసారా మేము ఇస్తామన్నా ఆయన వద్దన్నారు…” అంటూ రఘువీరుడు మళ్ళీ పాత పాటే పాడొచ్చును. “నేను తెదేపా, బీజేపీలకి మిత్రపక్షమే కానీ బానిసను కాను,” డిక్లేర్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఓ నాలుగు ట్వీట్లు పడేయోచ్చును. “హలో…ట్వీట్లు పంచడం కాదు రోడ్డు మీదకు వస్తే ఫాలో అవడానికి మేము ఇక్కడ వెయింటింగ్ అమ్మా!” అని శివాజీ మరో మారు గట్టిగా అనౌన్స్ మెంట్ చేయవచ్చును. ఓవర్ ఆల్ గా ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా అక్కడ మోడీ ప్రత్యేక హోదా ఇవ్వనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రజలకు, ప్రతిపక్షాలకు సంజాయిషీలు, సమాధానాలు ఇవ్వాల్సిన ఆగత్యం ఏర్పడుతోంది. వాళ్లకి అవి నచ్చకపోతే మంత్రులతో అత్యవసరసమావేశాలు ‘కీలక నిర్ణయాలు’ తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడమే కాదు, రాష్ట్ర విభజన తరువాత కూడా రాష్ట్రానికి పెను సమస్య సృష్టించి జనాలకి, చంద్రబాబుకీ కూడా సిన్మా చూపిస్తోంది.