భారత దేశంలో రుణభారమే రైతుకు అతిపెద్ద శాపం. అప్పుల భారం పెరగడం వల్లే లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే, రైతన్నపై రుణభారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి రుణాకు 7 శాతం వడ్డీ వర్తింపచేయాలని నిర్ణయించింది. సకాలంలో అప్పు తీర్చిన వారికి 4 శాతం వడ్డీకే రుణాలు అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. 3 లక్షల రూపాయల వరకూ ఈ రాయితీని వర్తింప చేయడం వ్యవసాయానికి ఊతమిచ్చే నిర్ణయం.
పంట రుణాలు సరిగా అందక పోవడమే రైతులకు పెద్ద అవరోధంగా ఉంది. ప్రయివేటు వ్యాపారులు అడ్డగోలుగా వడ్డీ గుంజడం అన్నదాతకు గుదిబండ అవుతోంది. 7 శాతం వడ్డీకే రుణాలు లభిస్తే చెల్లించడం మరింత సులభం అవుతుంది. ఒకవేళ పంటలు పండకపోతే దానికి బీమా వర్తింపచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ కేంద్రం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఫసల్ బీమా యోజన పేరుతో సరళమైన విధానాన్ని ప్రకటించింది. అంతకు ముందున్న కఠినమన నిబంధనల్ని ఎత్తివేసింది. రైతు హిత విధానంగా దాన్ని రూపొందించింది.
అయితే కేంద్రం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు బడా కంపెనీలకు వేల కోట్ల రూపాయల రుణాలను ఉదారంగా ఇస్తుంటాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి మాత్రం వెనుకాడతాయి. లక్ష రూపాయల పంట రుణం కావాలంటే సవాలక్ష కొర్రీలు పెడుతుంటాయి. ఇక, కౌలు రైతు పరిస్థితి మరీ దారుణం. ఈ విషయంలో కేంద్రమే చొరవ తీసుకోవాలి. పంట రుణాన్ని ఎలా ఇవ్వకుండా తప్పించుకుందామా అని కాకుండా వీలైనంత మంది రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలి.
నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన ఏ రైతుకూ పంట రుణాన్ని తిరస్కరించకూడదనే కఠిన నిబంధనను అమలు చేయాలి. ఒకవేళ తిరస్కరిస్తే దానికి బ్యాంకు చెప్పే కారణం సహేతుకుంగా ఉండాలి. అలా లేకపోతే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకునే రూల్స్ ఉండాలి. అవసరమైతే చట్టాలను సవరించాలి. అప్పుడే జై కిసాన్ అనే నినాదం ఆచరణలోనూ ప్రతిధ్వనిస్తుంది.