ఐదంటే ఐదు సంవత్సరాలు.. అంతే, అంతవరకూ ఓపిక పడితే చాలు! సమస్యలన్నీ ఇట్టే తీరిపోతాయి. అంతేకాదు, అవి పునావృతం కావు. అంటే, శాశ్వత ప్రాతిపదికన సమస్యల్నింటికీ టోకున పరిష్కారం చూపించబోతున్నారన్నమాట! అదేనండీ.. అన్నదాతల సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలివి. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మధ్యప్రదేశ్ కు రాహుల్ గాంధీ వెళ్లడం, పరిస్థితి అదుపు తప్పి కాల్పులు జరగడంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఎక్కడ సమస్యలుంటే అక్కడికి వెళ్లడం, ఫొటోలు దిగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు.
దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ప్రస్తుతం పరిపాలిస్తున్న భాజపా సర్కారో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదన్నారు. అంటే, గత పాలకుల తీరు వల్లనే.. సూటిగా చెప్పాలంటే అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకోలేదని ఇన్ డైరెక్ట్ గా వెంకయ్య నాయుడు చెప్పారు. అయితే, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆయన అన్నారు. దీనికి బహుముఖ వ్యూహం అవసరమనీ, దాన్ని రచించే పనిలోనే మోడీ సర్కారు తలమునకలై ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందనీ, రెట్టింపు అవుతుందనీ వెంకయ్య చెప్పారు. రుణమాఫీల గురించి కూడా మాట్లాడుతూ.. ఇది రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం కాదని చెప్పారు.
సరే.. రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదనుకున్నప్పుడు మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఎందుకు హామీ ఇచ్చినట్టు అనేది ప్రశ్న? అది తాత్కాలిక పరిష్కారమే అనుకున్నప్పుడు.. ఇతర రాష్ట్రాల విషయంలో కూడా అదే అమలు చేస్తామని చెప్పాలి కదా. ఉత్తరాఖండ్ లోగానీ, పంజాబ్ విషయంలోగానీ ఆ ఊసే ఎత్తలేదు. అంటే, కేవలం భాజపా అధికారంలోకి వచ్చే రాష్ట్రాల రైతుల విషయంలోనే పరిష్కారం గురించి ఆలోచిస్తారేమో! అది సరే.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనడం మంచి విషయమే. అయితే, అంతవరకూ రైతులు వెయిట్ చేయాల్సిందేనా..? ఈలోగా పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఉంటుంది కదా. మధ్యలో ఉన్న ఐదేళ్ల కోసం తాత్కాలికంగా ఏదైనా ప్లాన్ ఉందా..? అంతెందుకు, గడచిన మూడేళ్ల పాలనలో దేశానికి వెన్నముక అయిన రైతుకు అద్భుతంగా ఉపయోగపడే నిర్ణయం ఇదీ అని చెప్పుకోదగ్గది ఏదైనా ఉందా..? వీటి గురించి కూడా వెంకయ్య చెబితే బాగుండేది కదా!