ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో నీతీ ఆయోగ్ తీసుకొచ్చి.. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం మోడీ ఎలా పెంచుకున్నారో తెలిసిందే. ఇప్పుడు యు.జి.సి. విషయంలోనూ అదే పని చేస్తున్నారు. మొత్తంగా యు.జి.సి.ని రద్దు చేసేందుకు చట్టాన్ని తీసుకొస్తున్నారు. దీని స్థానంలో ఉన్నత విద్యా కమిషన్ తీసుకొస్తామని చెబుతున్నారు. దీనికి అధ్యక్షుడిగా ఒక మంత్రి ఉంటారనీ అంటున్నారు. దీంతో ఇన్నాళ్లూ సర్వాధికారాలతో, స్వతంత్రంగా వ్యవహరించే యు.జి.సి. కూడా కేంద్రం చెప్పుచేతలో నడిచే వ్యవస్థగా మారిపోతుంది! ఈ నిర్ణయంపై విద్యావేత్తలతోపాటు, ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సంస్కరణల పేరుతోనే ఇదంతా చేస్తున్నామని భాజపా చెప్పినా… కేవలం తమ చెప్పుచేతల్లోకి ఉన్నత విద్యను లాక్కునే ప్రయత్నమే కనిపిస్తోంది. యు.జి.సి. ఛైర్మన్ మొదలుకొని సభ్యుల వరకూ ఎవర్ని తొలగించాలన్నా ఆ అధికారం ఇకపై ప్రభుత్వానికే ఉంటుంది. దీని ద్వారా తమకు నచ్చినవారిని అక్కడ పెట్టుకోవచ్చు, తమకు నచ్చినట్టు ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఇంకోపక్క, యు.జి.సి.కి ఆర్థిక అధికారాలు కూడా లేకుండా చేయడంతో… దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. అధికారాలన్నీ కేంద్రం చేతికే వెళ్లిపోతే తమకు నచ్చిందే సిలబస్ అనీ, తమకు అనుకూలంగా లేని విద్యా సంస్థలపై కక్ష సాధింపులకు కూడా వెళ్లే ఆస్కారం ఏర్పడుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగంలో గణనీయమైన మార్పులు తీసుకుని రావాలంటే సంస్కరణలు సరిపోతాయి. అంతేగానీ, ఎప్పట్నుంచో సమర్థంగా నడుస్తున్న యు.జి.సి.ని సమూలంగా రద్దు చేయడం అంటే… కేంద్రం గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న లక్ష్యమే కనిపిస్తోంది. ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి, నీతీ ఆయోగ్ తీసుకొచ్చారు. దానికి ప్రధాని అధ్యక్షుడు కావడం, వారికి నచ్చిన రాష్ట్రాల పట్ల ఒకలా, నచ్చని రాష్ట్రాలపై మరొకలా వ్యవహరించడం ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యు.జి.సి. విషయంలోనూ సంస్కరణల పేరుతో మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయమూ దాదాపు అలాంటిదే అవుతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల అధికారాలూ హక్కులపై నెమ్మదిగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. వికేంద్రీకరణను తగ్గించి, ప్రతీదానికీ కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడాలనే పరిస్థితిని తీసుకొస్తున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న రోజుల్లో.. ఎప్పటికప్పుడు కేంద్రం తీరుపై దీక్షలు చేస్తుండేవారు! రాష్ట్రాల అధికారాలను కేంద్రం కాలరాస్తోందనీ, తొక్కేస్తోందనీ విమర్శించేవారు. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలని మాట్లాడేవారు. కానీ, ఆయన ప్రధాని అయ్యాక.. రాష్ట్రాలకు అధికారాలే వద్దూ, అన్నీ తన దగ్గరే ఉండాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు యు.జి.సి.పై కూడా పడటాన్ని నియంతృత్వ పోకడగానే చూడాలి.