లాక్ డౌన్ ఎత్తివేత దిశగా కేంద్రం… ఆలోచనలు ప్రారంభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ఈ మేరకు సూచనలు చేశారు. ఒకే సారి లాక్డౌన్ ఎత్తివేస్తే..అందరూ ఒకే సారి రోడ్ల మీదకు వస్తారని.. దీని వల్ల మళ్లీ సమస్య మొదటికి వస్తుందన్న అభిప్రాయాన్ని సమావేశంలో నరేంద్రమోడీ వ్యక్తం చేశారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రులకు గుర్తు చేశారు. అంటే.. ప్రధానమంత్రి లాక్డౌన్ ఎత్తివేత దిశగా చర్యలు తీసుకుంటున్నారన్న విషయం స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశంలో ఇప్పుడు బయటపడుతున్న పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లిన వారివి.. వారి నుంచి ఇతరులకు కాంటాక్ట్ ద్వారా పాజిటివ్‌గా తేలిన కేసులే. విదేశాల నుంచి వచ్చిన క్వారంటైన్ ఈ నెల ఏడో తేదీతో పూర్తవుతుంది. వారిలో వైరస్ లక్షణాలు ఏమైనా ఉంటే.. ఆ పాటికి బయటపడుతుంది. లేకపోతే.. వైరస్ లేనట్లే. ఇప్పటికే తబ్లిగీ జమాతే లో ప్రార్థనలకు వెళ్లిన వారందర్నీ దాదాపుగా … అన్ని రాష్ట్రాల్లోనూ ట్రేస్ చేసిన అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వీలైనన్ని ఎక్కువగా పరీక్షలు నిర్వహించి.. ఐసోలేషన్‌కో.. క్వారంటైన్‌కో తరలిస్తున్నారు. వీరు కూడా.. ఢిల్లీకి వెళ్లి వచ్చి పధ్నాలుగు రోజులు పూర్తయింది. ఎలా చూసినా.. వచ్చే ఐదు రోజుల్లో బయటపడే పాజిటివ్ కేసులే తప్ప.. కొత్తగా రావన్న అంచనా ఆరోగ్య నిపుణుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. శుక్రవారం ఉదయం… ప్రజలకు వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన వీడియో సందేశం ఎయిర్ అవుతుంది. అందులో.. ప్రస్తుతం దేశంలో కరోనా ఉన్న పరిస్థితి.. ప్రజలు మరికొద్ది రోజుల పాటు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించే అవకాశం ఉంది. అలాగే.. లాక్ డౌన్‌ను సడలించి.. దేశంలో మళ్లీ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా.. వెసులుబాట్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.