ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతీ విడత పోలింగ్ జరిగే ముందు మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఐదో విడత పోలింగ్ కు ముందు ఇచ్చిన ఇంటర్యూల్లో ఎక్కువగా దక్షిణాది గురించి చెప్పారు. దక్షిణాదిలో తాము అత్యధిక సీట్లు సాధిస్తామని అంటున్నారు. మోదీ మాటల్లో మర్మం.. తాము ఉత్తరాదిలో కోల్పోయే సీట్లను దక్షిణాదిలో నిలబెట్టుకుంటామనే. మరి నిజంగా దక్షిణాదిలో బీజేపీకి అంత సానుకూలత ఉందా.. మోదీ అంచనాలు ఎందుకలా వేసుకుంటున్నారు ?
దక్షిణాదిలో ఈ సారి బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నవి తెలుగు రాష్ట్రాలు. గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఎనిమిది నుంచి పది సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో మిత్రపక్షాలు టీడీపీ, జనసేనతో కలిసి 20 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక కర్ణాటకలో ఎన్ని సీట్లు గెల్చుకుంటారన్నదానిపై స్పష్టత లేదు. గతంలో స్వీప్ చేశారు. కానీ ఈ సారి పది సీట్ల వరకూ కోల్పోయినా ఆశ్చర్యం లేదన్న వాదన ఉంది.
కేరళలో, తమిళనాడులో కొన్ని సీట్లు సాధిస్తామని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. ఎలా చూసినా అక్కడ గెలిచే సీట్లు అద్భుతమే అవుతుంది. అంటే మోదీ ఆశలు తెలుగు రాష్ట్రాలపైనే అనుకోవచ్చు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తోందని ..మోదీ మాటల్లో అదే వ్యక్తమవుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాలు వెల్లడిస్తున్నాయి.