అమరావతి శంకుస్థాపన నాడు ఏపీకి ఏమీ ప్రకటించుకుండానే వెళ్లిపోయారని ప్రధాని మోడీపై విమర్శలు వచ్చాయి. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు, ప్యాకేజీ ఊసేలేదని ప్రతిపక్షాలే కాదు, స్వయంగా బీజేపీ నాయకులే నిరాశ చెందారు. చంద్రబాబు పరిస్థితి అయితే మరీ బాధాకరం. భారీగా ఖర్చు పెట్టి నభూతో అన్న విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఉసూరుమనిపించారు మోడీ. ఇదీ ఏపీలో అత్యధికుల అభిప్రాయం.
నిజానికి మోడీ చాలా ఇచ్చారు. తరచి చూస్తే తత్వం బోధపడుతుంది. రెండేళ్లుగా పెద్దగా జనంలోకి చొచ్చుకుపోలేక నామ్ కే వాస్తేగా మారిన కాంగ్రెస్ పార్టీకి, ఊపు తేవడానికి… అనుకోకుండానే ఓ అస్త్రాన్నిచ్చారు. మట్టి సత్యాగ్రహం పేరుతో ఊరూ వాడా కేడర్ ను ఉత్సాహ పరిచి, ఉద్రేక పరిచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి సువర్ణావకాశం ఇచ్చారు. మొన్న లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వలస యాత్ర జరిగింది. చివరకు కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర అవసరమనే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ పుంజుకోవాలంటే కేడర్ ను బిజీగా ఉంచాలి. ఏదో ఒక కార్యక్రమం అప్పగించాలి. అందుకు మట్టి సత్యాగ్రహం మహా ప్రసాదంగా దొరికింది. మోడీకి వ్యతిరేకంగా ఆందోళన పేరుతో వాడవాడలా ఊరేగింపులు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు జోరుగా జరుగుతాయి. కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ కేడర్ కు, లీడర్లకు చేతినిండా పని. ఆ విధంగా పరోక్షంగా మోడీ చాలానే ఇచ్చారని కాంగ్రెస్ వారు ఖుషీగానే ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత దూకుడుగా జనంలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవడానికి సరైన ఊతం దొరికినందుకు వాళ్లంతా సంబరపడుతున్నారు.
వైసీపీ సైతం ఈ పరిణామంతో దూకుడును పెంచింది. అయితే మోడీకంటే చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ వలె మోడీ ప్రభుత్వంపై వైసీపీ అంత కటువుగా ఆరోపణలు చేయదు. అందుకు జగన్ కు ఉన్న కారణాలు వేరే కావచ్చు. కానీ చంద్రబాబు మీద వీలైనంత దుమ్మెత్తి పోయడానికి అవకాశం దొరికింది. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ రాలేదంటూ బాబుమీద విరుచుకు పడటమే పనిగా పెట్టుకోవడానికి, ఫ్యాన్ గాలిని పెంచడానికి ఇది ఉపయోపడుతుంది. మోడీ ఒక్క ప్రకటన చేసి ఉంటే కాంగ్రెస్ కు, వైసీపీకి ఈ అవకాశం లభించి ఉండేది కాదని టీడీపీ వారు బాధపడిపోతున్నారు. ఇంతకీ ఏపీకి ప్యాకేజీని మోడీ ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రకటించకుండా ఉండటం సాధ్యం కాదని, కాబట్టి త్వరలోనే అది జరుగుతుందని బీజేపీ వారు చెప్తున్నారు. ఈలోగా ఈ ఆలస్యాన్నే అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు ధర్నాలు నిరసనలతో కేడర్ లో జోష్ పెంచుకుంటాయి. అదీ రాజకీయం.