ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలప్పుడు విస్తృత ప్రచారం చేసి పక్కనే ఉన్న ఉత్తరాఖండ్లో పోలింగ్ రోజు మకాం వేశారు. ఆ రోజు ఆలయం లో ఆయన కార్యక్రమాలు …పోలింగ్ తో పాటు వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే వ్యూహం తెలంగాణ విషయంలోనూ పాటిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో .. తెలంగాణలో పోలింగ్ రోజున.. పక్కన రాష్ట్రం ఏపీలో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీ తిరుపతిలో మూడు రోజులు ఉండనున్నట్లుగా బీజేపీ వర్గాలకు సమాచారం వచ్చింది.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో మోదీ తిరుమల , తిరుపతిల్లో పర్యటిస్తారని అధికార వర్గాలకు సమాచారం వచ్చింది. 28వ తేదీన తెలంగాణలో ప్రచారానికి చివరి గడువు. ఆ రోజన తెలంగాణలో ప్రచారం చేసి.. తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది. 29వ తేదీన తిరుపతిలో కార్యక్రమాలు … తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో పోలింగ్ రోజున అంటే 30వ తేదీన ఉదయం తిరుమల నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభమయి.. తిరుపతిలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన వరకూ ఉండే అవకాశం ఉంది.
ఓ వైపు తెలంగాణలో పోలింగ్ జరుగుతూంటే.. మరో వైపు ప్రధాని మోదీ తిరుపతిలో హడావుడి చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇది పొరుగు రాష్ట్ర ప్రజల్నిప్రభావితం చేయడమేనన్న ఆరోపణలు వచ్చినా ఆయన పట్టించుకోరు. యూపీలో ఎన్నికల సమయంలో ఉత్తరాఖండ్ లో ఆయన చేసిన గుళ్ల పరిశీలన.. పూజలపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. మోదీ తిరుపిత మూడు రోజుల పర్యటనలపై అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.