రైతు రుణమాఫీ… కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద అంశమైపోయిందిప్పుడు. దాదాపు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రైతు రుణాల మాఫీలను కాదనలేని పరిస్థితి. కానీ, ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రం… ఈ అంశంపై కిందామీదా పడుతోంది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణ మాఫీలను ప్రకటించేశారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా… కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ అని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటున్నారు. అంతేకాదు… గడచిన నాలుగున్నరేళ్లలో దేశంలోని ఒక్క రైతుకైనా, ఒక్క పైసా అయినా మోడీ రుణమాఫీ చేశారా అనీ, ఆయన స్నేహితులకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేశారంటూ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ‘రైతు రుణమాఫీ’ హామీ కాంగ్రెస్ కి రాజకీయంగా బాగా కలిసొచ్చే హామీగానే కనిపిస్తోంది. అయితే, దీనిపై ఎలా స్పందించాలో ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అర్థం కావడం లేదన్నట్టుగా ఉంది.
ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ… రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుతోవ పట్టిస్తోందన్నారు. ఆ పార్టీ చేస్తున్న మాఫీ కేవలం ఒక లాలీపాప్ లాంటిదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఏర్పడ్డ కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం 800 మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసిందన్నారు. గత లోక్ సభ ఎన్నికల ముందు కూడా రుణమాఫీ హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ హయాంలో అనర్హులకే రుణమాఫీ జరిగిందన్నారు ప్రధాని. అంతేకాదు, ప్రైవేటు వ్యాపారుల వల్ల ఎక్కువగా వడ్డీకి అప్పులు తీసుకుని రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ, ఇలాంటివారే ఎక్కుమంది ఉన్నారన్నారు. మీ చౌకీదార్ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో ఉన్నారనీ, దొంగలకే నిద్రలు పట్టడం లేదనీ, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఆ దొంగల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తా అంటూ మోడీ ప్రసంగించారు.
రైతు రుణమాఫీ విషయంలో మోడీ స్పష్టమైన వైఖరిని ప్రకటించలేకపోతున్నారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ పూర్తి చేయలేదంటారు! ఆ వెంటనే… అనర్హులకు రుణమాఫీ జరిగిందంటారు. అంటే, అమలు చేసిందనీ ఆయన చెప్తున్నట్టే కదా. రుణమాఫీ లాలీపాప్ అంటారు… ఆ వెంటనే, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకున్న రైతులే ఎక్కుమంది అంటారు! అంతేగానీ… రైతులకు రుణభారం తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఏం చేసిందనిగానీ…మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామనిగానీ స్పష్టంగా ప్రధాని మోడీ మాట్లాడలేకపోతున్నారు.