భారత ప్రధాని నరేంద్రమోదీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరుగు ప్రయాణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను కలిశారు. కేవలం ఒక ట్విట్టర్ పోస్టింగ్ ద్వారా భారత విదేశాంగ విధానంలో ఒక కీలక పరిణామాన్ని మోదీ నాటకీయంగా ప్రపంచం ముందు ఆవిష్కరించారు. సాంప్రదాయాలు, ప్రోటోకాల్ లాంఛనాలను, చివరికి బిజెపి అభిమతాన్ని కూడా పక్కన పెట్టి ”స్వతంత్రించిన మోదీ” చర్య ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
ఇష్టంలేని వారు పాకిస్తాన్ పోవలసిందే అన్న బిజెపి సాధ్వులు, మహారాజ్ లకు మోదీ ఆకస్మిక పాక్ సందర్శన లాగి చెంపపగలగొట్టినంత ఘాటైన నిశ్శబ్ద సమాధానం కూడా!!
కాశ్మీర్ లో కొంత భాగం తమదేనన్నది పాకిస్తాన్ పేచీ…తీవ్రవాదుల్ని పాకిస్తాన్ మనకు ఎగుమతి చేస్తోందన్నది ఇండియా అభ్యంతరం. చైనాకు భారత్ కు మధ్య కూడా సరిహద్దు తగాదాలు వున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో కొంత భాగాన్ని చైనా తనదిగా మేప్ లలో చూపిస్తోంది. దీనిపై అంతర్జాతీయ వేదికలమీద ఇండియా ఫిర్యాదులను నమోదు చేసింది. అయితే చైనా ఇండియాల మధ్య వాణిజ్య సంబంధాలు ఆగలేదు సరికదా, పెరుగుతున్నాయి కూడా.
భారత్, పాకిస్తాన్ లమధ్య దాయాది పోరు ఆగడం లేదు పైగా పెరుగుతోంది. అపుడు కాంగ్రెస్, ఇపుడు బిజెపి సొంత రాజకీయ అవసరాలకోసం ఈ వాతావరణాన్ని పెంచిపోషిస్తున్నాయి. ఇండియాలో ఎక్కడైనా ఎన్నికలు వుంటే చాలు పాక్ తో చర్చల ప్రక్రియ ఆగిపోతుంది. పాక్ పై అధికారంలో వున్న నాయకులు కఠువైన భాష వాడుతారు. బీహార్ ఎన్నికలకు ముందు కూడా ఇదే జరిగింది. ఎన్నికల తర్వాత చర్చల ప్రక్రియ మొదలౌతుంది. పాకిస్తాన్ కూడా ఇండియా పట్ల ఇదే ధోరణితో వుంది.
హిందుత్వ సంస్ధల మాటలు విమర్శలు వ్యాఖ్యానాలు పాకిస్తాన్ తో స్నేహసంబంధాలను నెలకొల్పేవిగా వుండవు. ఆభావజాలానికి రాజకీయవేదిక అయిన బిజెపి అభ్యంతరాలవల్లే పాక్ వెళ్ళడానికి సిద్ధమైన అప్పటి ప్రధాని మన్ మోహన్ సింగ్ పర్యటనను విరమించుకున్నారు.
అప్పటికీ ఇప్పటికీ రెండుదేశాల పరిస్ధితుల్లో మౌలికమైన మార్పు ఏదీరాలేదు. మన్ మోహన్ సింగ్ ను పాకిస్తాన్ వెళ్ళవద్దన్న బిజెపి ఇపుడు నరేంద్రమోదీ పాకిస్తాన్ వెళ్ళవచ్చని చెప్పలేదు. అయినా ఆయన చెప్పాపెట్టకుండా స్వతంత్రించి పాక్ వెళ్ళారు వచ్చారు. దీని పర్యావసానాలను కూడా మోదీయే మోయవలసి వుంటుంది.
రాజమండ్రి లాంటి చిన్నపట్టణంలో కూడా చైనా వస్తువులు దొరుకుతాయి. సరుకు బాగుంటే వినియోగదారులు చైనా పనితనాన్ని మెచ్చుకుంటారు. బాగోలేకపోతే తిట్టుకుంటారు. చైనా ట్రేడర్లతో నేరుగా మాట్లాడే వ్యాపారులు రాజమండ్రిలోనే నలుగురైదుగురు వున్నారంటే కనెక్టివిటీని అర్ధంచేసుకోవచ్చు. ఇందువల్లే ఆ దేశాన్ని ద్వేషించే వారు ప్రస్తుతం జనరేషన్లలో లేరు.
సరిహద్దు తగాదాల వల్ల చైనాతో రాజకీయ సంబంధాలు సరిగ్గాలేకపోయినా వాణిజ్య అనుబంధం భారత్ చైనాల మధ్య అగాధాలను పూడ్చివేస్తోంది.
పాక్ ప్రోత్సాహక తీవ్రవాదాన్ని ప్రతిఘటిస్తూనే, సరిహద్దు అతిక్రమణలకు తుపాకులతో సమాధానాలు చెబుతూనే, కాశ్మీర్ పై పాక్ వైఖరిని ఎండగడుతూనే ఆదేశంతో వాణిజ్య సాంక్కృతిక సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. పంజాబ్ హర్యానాల నుంచి పాకిస్తాన్ కు గోధుమలు ఎగుమతి చేయగలిగితే దగ్గరలో వుండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గి వారికి గోధుమలు చౌకగా లభిస్తాయి. అదేసమయంలో మన రైతుల గోధుమలకు మంచి ధర వస్తుంది అని జర్నలిస్టు, తెలంగాణా ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఉదాహరించారు.
ఇది రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మన నిపుణులు పాక్ లో సాఫ్ట్ వేర్ ట్రెయినింగ్ ఇవ్వగలిగితే రెండుదేశాల యువత మధ్య కార్డియల్ రిలేషన్స్ పెరిగే అవకాశం వుంది.
ప్రోటోకాల్ సాంప్రదాయాలు పక్కన పడేసి అనూహ్యంగా పాక్ వెళ్ళిన నరేంద్రమోదీ రెండుదేశాల ప్రజల్లో ప్రపంచ వ్యాప్తంగా దౌత్య వర్గాల్లో సంభ్రమాన్ని, ఆశ్చర్యాన్ని, సంచలనాన్ని సృష్టించాయి. ఇది ఇంతటితో ఆగిపోకుండా ఉభయదేశాల ప్రయోజనాలకు నిర్మాణాత్మకమైన సంబంధంగా మారాలని ఆశిద్దాం!