కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంటుందని… ఈమేరకు మొదటి దశ ఎన్నికల్లో ఇండియా కూటమికే మెజార్టీ స్థానాలు దక్కనున్నాయనే ప్రధాని మోడీ హేట్ స్పీచ్ ప్రారంభించారనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదివారం రాజస్థాన్ లో మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుండగానే మరోసారి యూపీ అలీఘడ్ వేదికగా మరోసారి అవే తరహ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఇండ్లున్న వాళ్ల నుంచి ఓ ఇంటిని లాక్కుంటుందని ఆరోపించారు. బంగారం, భూమి ఏమున్నా కాంగ్రెస్ కూటమి వదలదని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడంపైనే ఫోకస్ పెట్టారని… ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారన్నారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్ పై మోడీ రాజకీయ విమర్శలు చేశారు కానీ ఈ తరహ ఆరోపణలు చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీలోని సాధారణ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమే. కానీ ప్రధాని స్థాయి వ్యక్తులు ప్రజలను భయకంపితుల్ని చేసేలా ఆరోపణలు చేయడమే ఆలోచింపజేస్తోంది.
ఇళ్ళను , బంగారం, భూమిని లాక్కుంటారని ప్రధాని ఆరోపించడం వెనక ఏదైనా ఎత్తుగడ ఉందా..? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందన్న నివేదికలు అందటంతో మోడీ గేర్ మార్చారని… కాంగ్రెస్ టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేస్తున్నారనే హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు.