ప్రధానమంత్రి నరేంద్రమోడిది ఫక్తు జాతీయవాదం. భారతదేశం తప్ప.. ఆయనకు ఇతర దేశాలు ముఖ్యం కాదు. అయితే ఆయన అనూహ్యంగా ఓ క్లెయిమ్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాడారాట. ఆందోళనల్లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. బంగ్లాదేశ్ వెళ్లి.. అక్కడి స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో పాల్గొంటూ ప్రసంగించారు. అందులో బంగ్లా స్వాతంత్ర్యంలో తన వాటా ఉందని చెప్పాలనుకున్నారేమో కానీ… ఆనాటి పరిణామాల్లో ఆందోళనల్లో పాల్గొని జైలుకెళ్లినట్లుగా ప్రకటించేసుకున్నారు. నిజానికి బంగ్లాదేశ్ విభజనలో ఇండియాదే కీలక పాత్ర. కాకపోతే.. అది యుద్ధం రూపంలో జరిగింది. దేశంలో ఆందోళనలు జరిగినట్లు ఎలాంటి రికార్డులు లేవని కొంత మంది సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు.
తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది. ఆ తరువాతి రోజు వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. పాక్, ఇండియాల మధ్య డిసెంబర్ 3, 1971న యుద్ధం ప్రారంభమయ్యింది. 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం పాక్ ఆర్మీ చీఫ్, సైన్యం భారత దళాల ముందు బేషరుతుగా లొంగిపోవడంతో ముగిసింది. గత డిసెంబర్ పదహారో తేదీ నాటికి బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యాయి. అయితే పోరాటం అంతా సరిహద్దుల్లోనే సాగింది కానీ… ఇండియాలో బంగ్లాదేశ్ విభజనకు మద్దతుగా ఆందోళనలు జరిగినట్లుగా … వారిని అరెస్టులు చేసినట్లుగా ఎక్కడా లేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. బంగ్లాదేశ్ స్వేచ్చ కోసం తాను జైలుకెళ్లినట్లుగా ప్రకటించుకోగానే.. ఇటు సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమయింది. ఆయన 1971లో ఎక్కడున్నారో… ఎక్కడ ఆందోళనలు చేశారో.. ఏ జైలుకెళ్లారో బయట పెట్టాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఆయన ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మోడీ ఇలాంటి బిజారే ఇష్యూస్ క్లెయిమ్ చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మేఘాల మాటున యుద్ధవిమానాలు దాక్కుని వెళ్లి దాడులు చేశాయన్నారు. అలాంటి ఊహకందని స్టేట్మెంట్లు చాలా ఇచ్చారు. వాటిపై చర్చ జరగడమే కానీ ఆయన ఎప్పుడూ స్పందించలేదు.