2014కు ముందు అంతగా లేదు కానీ 2014 తర్వాత నుంచీ మాత్రం ‘ప్రతిపక్షాల కుట్ర’ అనడం పాలకులకు బాగా అలవాటయిపోయింది. నిజానికి కేంద్రంలో గద్దెనెక్కిన మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసీఆర్‌లు ప్రతిపక్షాలను ఎప్పుడో పూర్తిగా బలహీనం చేసేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశంలో కూడా అధికారంలో ఉన్నవాళ్ళను ఎదుర్కునే స్థాయి ప్రతిపక్షం లేని పరిస్థితి అందరికీ కనిపిస్తూనే ఉంది. అయినప్పటికీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ప్రతిపక్షాల కుట్ర అనడం పాలకులకు బాగా అలవాటైంది. సోషల్ మీడియా పుణ్యమాని పాలకుల తప్పులపై భారీగా స్పందన వస్తున్న నేపథ్యంలో పాపాన్ని కాస్త ప్రతిపక్షాలకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు.
తెలంగాణాలో రైతులకు సంకెళ్ళు వేశారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు జరిపారు. తెలంగాణా, మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బిజెపి నేతలందరిదీ కూడా ఒకటే మాట. అంతా ప్రతిపక్షాల కుట్ర అని. స్వచ్ఛంధంగా రైతులు ఆందోళనలకు దిగుతుంటే ఆ ఆందోళనలకు రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు సంకెళ్ళు వేయమని ప్రతిపక్షాలు చెప్పాయా? అలాగే రైతులను కాల్చమని ప్రతిపక్షాలు చెప్పాయా? అలా అని చెప్పి జనాలందరినీ నమ్మించే ప్రయత్నంలో వెంకయ్యనాయుడులాంటి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఫొటోలు దిగడం కోసం, ఆ పొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం రాహుల్ వస్తున్నారని అనడం వెంకయ్య స్థాయికి అస్సలు తగదు. అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ అండ్ కో తప్పులు చేసిన మాట వాస్తవం. అందుకే ప్రజలు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఆ ప్రజల అభిమానాన్ని మరోసారి గెల్చుకుందామని రాహుల్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో తప్పేముంది? రాహుల్ ఏం చేయాలో కూడా వెంకయ్యనే డిసైడ్ చేస్తాడా?
ప్రతిపక్షాల కుట్ర అనే విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టిడిపి నాయకులు అందరికంటే స్పీడ్ మీద ఉన్నారు. ఆ మధ్య ఎపి మంత్రి కొడుకు ఒక మహిళను వేధిస్తే దాని వెనుక కూడా జగన్ ఉన్నాడని ఆరోపించి కామెడీ చేసిన చరిత్ర వాళ్ళది. ఇప్పుడు సచివాలయం, అసెంబ్లీలోకి వర్షపు నీరు రావడం, చిన్నపాటి వర్షానికి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నానని చెప్పుకున్న నిర్మాణాలు డ్యామేజ్ అవ్వడంతో చంద్రబాబు ఇమేజ్‌పై దెబ్బపడుతోంది. అందుకే తెలివిగా తప్పును జగన్‌వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భజన మీడియా అండతో కొంతమందినైనా నమ్మించగలం అనుకుంటున్నారు కానీ ఎక్కువ మంది మాత్రం ఇలాంటి రాజకీయాలను హర్షించే అవకాశం లేదు. పైగా ఇంకాస్త అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. నరేంద్రమోడీ, కెసీఆర్, చంద్రబాబులతో సహా అధికారంలో ఉన్నవాళ్ళందరూ కూడా తప్పులను ప్రతిపక్షంపైకి నెట్టేసే ప్రయత్నాలు కట్టిపెడితే వాళ్ళకే మంచిది. ఓడిపోయినవాళ్ళపైన భారతీయ ఓటర్లకు సానుభూతి ఉంటుందన్న విషయం చరిత్ర చెప్తున్న నిజం. అలాంటి నేపథ్యంలో తాము చేసిన తప్పులను కూడా ప్రతిపక్షాలపైకి నెట్టేసే ప్రయత్నాన్ని పాలకులు చేస్తే ఆ సానుభూతి మరికాస్త పెరిగిపోయి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలకుల అసమర్థతను కూడా వాళ్ళే ఒప్పేసుకున్నట్టుగా ఉంటుంది.