బారతీయ టీ ప్రాముఖ్యతను దెబ్బతీయడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోందట..! ఇలా చేయడం వెనుక భారత్‌లోని కొన్ని పార్టీల హస్తముందట..! ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు.. ఫైళ్లు కేంద్రం వద్ద ఉన్నాయట..! త్వరలో ఈ కుట్రన్నింటినీ చేధిస్తారట..! అంతే.. కాదు ఈ పోరాటంలో అస్సాం టీ కార్మికులు విజయం సాధిస్తారట..!. .. ఈ కుట్ర సిద్ధాంతాన్ని చాలా పకడ్బందీగా చెప్పింది ఎవరో సామాన్యుడైతే.. కామెడీ అని అనుకోవచ్చు. కానీ ఇలా చెప్పింది సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆయన ఇప్పుడు.. బెంగాల్, అసోం ఎన్నికల మిషన్‌లో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. ఇలా అసోంలో ప్రచారానికి వెళ్లి టీ తోటలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బహిరంగసభలో మాట్లాడి.. టీ పై కుట్ర కోణాన్ని ఆవిష్కరించారు.
భారతీయ టీ బ్రాండ్ ను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూంటే… కార్మికులు వారితో పోరాడుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి ప్రయత్నం చేసి ఉంటే.. చేధించి… కుట్రదారుల్ని ప్రజల ముందు పెట్టాలి కానీ .. ఇలా ఎన్నికల సభల్లో రాజకీయానికి వాడుకోరు. కానీ మోడీ స్టైలే వేరు. ఆ బ్రాండ్ ను దెబ్బతీయడానికి ప్రయత్నించేది… కొన్ని రాజకీయ పార్టీలంటూ విపక్షాల మీద అనుమానం వచ్చేలా చేయడానికి ప్రయత్నించారు. ప్రధానమంత్రి స్థాయి నేత ఇలా మాట్లాడతారని చాలా మంది అనుకోలేరు కానీ.. గత ఎన్నికల సమయంలోనూ ఆయన వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఆరోపణలు చేశారు. చివరికి ఏపీలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు.
అలాగే ఐటీ గ్రిడ్ పేరుతో వైసీపీ ఆడిన డేటా చోరీ గేమ్‌ను కూడా చేశారని ఆరోపించారు. ప్రధాని స్థాయి వ్యక్తి చేయాల్సిన విమర్శలు కాదని అప్పుడే చెప్పుకున్నారు. కానీ ఎన్నికల విషయంలో ఆయన తన హోదాను పట్టించుకోరు. విపక్షాలను వాస్తవమో.. అవాస్తవమో ఏదో ఒకటి చెప్పేసి.. కంగారు పెట్టేయాలనుకుంటారు. ప్రజల్లో వారిపై అనుమానాలు రేకెత్తించాలని అనుకుంటారు. అందుకే ఇప్పుడు అసోం వెళ్లి “టీ” పై కుట్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు.