జనం మొత్తం తమను నిందిస్తూ ఉంటే ఉక్రోషం పట్టలేకపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగ్రహం భాజపా వారి మీదకు మళ్లుతున్నట్లుంది. తెదేపాకు చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భాజపా ఏపీ అవసరాల పట్ల స్పందిస్తున్న తీరును ఒక రేంజిలో ఆడుకున్నారు. దేశంలో అవకాశవాదులు అందరూ మోడీ భజన చేసి తరిస్తూ ఉన్న సమయంలో… సోనియాకు పట్టిన గతే మోడీకి కూడా పడుతుందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ప్రస్తావించకుండా.. నిప్పులు చెరగడం విశేషం.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి భారతీయ జనతా పార్టీ మీద సోమవారం నాడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. ఏపీలో కాంగ్రెసుకు పట్టిన గతే.. భాజపాకు కూడా పడుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోస్యం చెప్పారు. తెలుగుదేశం వంటి మంచి మిత్రపక్షాన్ని కోల్పోవద్దంటూ ఆ పార్టీకి హితవు చెప్పారు. సోనియాగాంధీ పతనం అయిన తీరులోనే మోడీ కూడా పతనం అవుతారంటూ.. మోడీ అనే పదం బదులుగా ‘మరో నేత’ అంటూ గోరంట్ల ఆగ్రహించారు.
ఈ ఎమ్మెల్యే దూకుడైన మాటలు.. భాజపా పట్ల తెదేపా మారుతున్న వైఖరికి నిదర్శనమా అనే అభిప్రాయం కలుగుతున్నది. తెదేపా వారితో తెగతెంపులకు సిద్ధపడుతున్నదా.. ఆ పార్టీలో ఆ ఆలోచనలు పెరుగుతున్నవా అనే ప్రచారానికి ఇది నిదర్శనం కూడా. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల నాటికి భాజపాను బలోపేతం చేసుకుని, ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదగాలని… కాంగ్రెస్ పతనం ద్వారా ఏర్పడిన రాజకీయ శూన్యతను తాము దక్కించుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతూ ఉండగా.. కాంగ్రెస్ మాదిరిగానే పతనం తప్పదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాపనార్థాలు పెట్టడం గమనార్హం. మరి వీటి పట్ల భాజపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.