తెలంగాణలో రాజకీయాలు అంతకంతకూ హీటెక్కుతున్నాయి. కేసీఆర్ పద్దెనిమిదో తేదీన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నా.. పార్టీ పరంగా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నా కేసీఆర్ స్వాగతం చెప్పడం దాదాపుగా మార్చిపోయారు. ఈ సారి కూడా ఆయన స్వాగతం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసులు, విచారణలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది
మరో వైపు ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సభ పెట్టే రోజున.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్కు చెందిన కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే ఒప్పించింది. అయన పద్దెనిమిదో తేదీన తన అనుచరగణంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కమ్మంమలో ఉన్న వర్గ పోరాటాల కారణంగా పార్టీ నేతల్ని కాపాడుకోవడం బీఆర్ఎస్కు ఓ సవాలేనని అనుకోవచ్చు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తరవాత బీజేపీ మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తుందని.. చేరికలు పెరుగుతాయని బీజేపీ నేతలంటున్నారు.