ప్రధాన మంత్రి హోదాలోనూ నరేంద్ర మోడీలో పూర్తి పరిణతి రాలేదేమో అనిపించే పరిస్థితి కొనసాగుతోంది. గ్రూపు రాజకీయాలను పెంచిపోషించే తరహాలో ఆయన నిర్ణయాలు బీజేపీకి నష్టం కలిగిస్తున్నాయి. ఉద్దేశ పూర్వకమో లేక కాకతాళీయమో గానీ, కొందరు నేతల పట్ల మోడీ వైఖరి పార్టీకి చేటు చేస్తోంది. అందుబాటులో ఉన్న ట్రంప్ కార్డులను ఉపయోగించుకోక పోవడం మోడీ, షా జోడీ వైఫల్యం. ఢిల్లీ, బీహార్లో అదే జరిగింది.
వాజ్ పేయి శైలి వేరు. అందరూ ఆయన మనుషులే. అద్వానీ విధేయలైనా మరెవరైనా పార్టీలోని వారందరినీ ఆప్యాయంగా పలకరించే వారు. సత్తానుబట్టి వారికి అవకాశాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకునే వారు. ఆ వైఖరి వల్లే మోడీకి గుజరాత్ ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇప్పుడు నరేంద్ర మోడీ శైలి భిన్నంగా ఉంది. ఆయనకు పార్టీలో కొందరు ఇష్టమైన వారున్నారు. కొందరు అంతగా నచ్చని వారున్నారు. ఆ తేడాయే ఎన్నికల్లో తేడా రావడానికి కారణమవుతోందంటున్నారు పరిశీలకులు.
ఢిల్లీలో కేజ్రీవాల్ కు సమఉజ్జీ లాంటి హర్షవర్ధన్ ను ట్రంప్ కార్డులా ప్రయోగించే అవకాశం ఉంది. కానీ మోడీ, అమిత్ షా జోడీ ఆ పని చేయలేదు. ఢిల్లీని పోలియో రహిత నగరంగా చేసిన డాక్టర్. అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకుడు అయిన హర్షవర్ధన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఫలితం వేరేగా ఉండేదేమో. కానీ మొదటి నుంచీ ఆయన మోడీకి అంత సన్నిహితుడు కాదు. అయితే మాత్రం, పార్టీ నాయకుడే కదా అని విశాల హృదయంతో నిర్ణయం తీసుకుని ఉంటే ఢిల్లీ కైవసం అయ్యేదేమో. ఆగమేఘాల మీద కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వికటించింది. ఆమె ఓ పోలీస్ లాగే కనిపించారు తప్ప, ప్రజా నాయకురాలిగా అగుపించలేదు. అదే బీజేపీని దెబ్బకొట్టింది.
బీహార్లో నితీష్ కుమార్ లాగే సుశీల్ కుమార్ మోడీకి ప్రజల్లో మంచి పేరుంది. ఏడాది క్రితం వరకూ ఉఫ ముఖ్యమంత్రి అయిన సుశీల్, సౌమ్యుడు, సమర్థుడు, నిజాయితీ పరుడనే పేరుంది. ఏ రకంగా చూసినా నితీష్ తో సరితూగే వ్యక్తి. ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బాగుండేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి సీఎం అభ్యర్థిగా లేకపోవడంతో ప్రజలు ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి నితీష్ ను పోల్చి చూసుకోవాల్సి వచ్చింది. ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది?
సుశీల్ మోడీ మొదటి నుంచీ నరేంద్ర మోడీకి అంత సన్నిహితుడు కాడట. అందుకే బీహార్లో గెలిచిన తర్వాత తమకు నచ్చిన వ్యక్తిని సీఎంని చేద్దామని మోడీ, అమిత్ షా భావించారని వార్తలు వచ్చాయి. కనీసం సుశీల్ మోడీని ప్రచారంలో కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. పరచారంలో, పోస్టర్లలో మోడీ, అమిత్ షా తప్ప సుశీల్ మోడీ గానీ ఇతర స్థానిక నేతలు గానీ కనిపించ లేదు.
ముందు ముందు బీజేపీ ఇంకా అనేక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరివాడైన వాజ్ పేయిని అనుసరిస్తే అది పార్టీకి మేలు చేస్తుంది. తనకు అంత సన్నిహితుడు కాకపోయినా, ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తికి అవకాశాలిస్తే అది పార్టీకే కాదు, ఆ రాష్ట్రానికీ మంచిది. ఇకముందు మోడీ తప్పకుండా వాజ్ పేయి బాటలో నడిచే అవకాశం ఉందంటున్నారు కమలనాథులు.