భజనతో అధినేతలను బుట్టలో పడేద్దామనుకుంటారో…లేకపోతే అధినాయకుల సామర్థ్యంపైన వాళ్ళకు లేని నమ్మకం నాయకులకు ఉంటుందో తెలియదు కానీ పార్టీ అధినేతలు అనితరసాధ్యులు అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మాత్రం పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీని గొప్ప నాయకుడిగా ప్రజలకు చూపించడానికి….నమ్మించడానికి దశాబ్ధాలుగా దండయాత్రల్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ నాయకుల చేస్తున్న విశ్వప్రయత్నాలన్నీ కూడా రాహుల్ నోటి వెంట వచ్చే ఒక్క కామెడీ డైలాగ్‌తో సర్వనాశనం అయిపోతున్నాయి. రాహుల్ గాంధీ చాలా పెద్ద కమెడియన్‌గా మిగిలిపోతున్నారు. అలాగే నారా లోకేష్‌ని కూడా గొప్ప నాయకుడిగా తెలుగు ప్రజలను నమ్మించడానికి చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు, టిడిపి అనుకూల మీడియా కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కానీ టిడిపి కార్యకర్తల్లో కూడా లోకేష్ సామర్థ్యంపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. ఇవి రెండు ఫెయిల్యూర్ స్టోరీస్‌గా చెప్పుకుంటే మోడీ విషయంలో మాత్రం బిజెపి నాయకులు సక్సెస్ అయ్యారు. 2014 ఎన్నికల టైంకి ఓటర్లు అందరిలోనూ మోడీకి ఒక హీరోయిక్ ఇమేజ్ క్రియేట్ చేయడంలో బిజెపి పార్టీ సూపర్ సక్సెస్ అయింది. మోడీ ప్రధాని అయితే భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, అవినీతిపరులను తన్ని తరిమేస్తాడు, పాకిస్తాన్ పీచమనుస్తాడు, కాశ్మీర్ సమస్యను పరిష్కరించేస్తాడు…..ఇలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ దేశం ఎదుర్కుంటున్న సమస్యలన్నింటికీ మోడీని ప్రధాని చెయ్యడం ఒక్కటే సరైన పరిష్కారం అని చెప్పి ఎక్కువ శాతం మంది ప్రజలను నమ్మించడంలో బిజెపి టీం సక్సెస్ అయింది. రాహుల్‌గాంధీలాంటి కామెడీ పొలిటీషియన్ పోటీలో ఉండడం కూడా మోడీకి భలే కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ సాధించి తన సూపర్ హీరో ఇమేజ్‌కి న్యాయం చేశాడు మోడీ.
కానీ మోడీ హీరోయిజం అంతటితో సరి. ప్రధాని అయిన తర్వాత నుంచీ పరిపాలన, అభివృద్ధి విషయంలో మోడీ చూపించిన హీరోయిజం ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి తెలుగు ప్రజల దృష్టిలో మోసగాడు కూడా అయ్యాడు. నోట్ల రద్దు నిర్ణయంతో ఏం సాధించాడో చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. అలాగే అవినీతి విషయంలో మోడీ సాధించిన విజయాలు ఏంటి అంటే కాంగ్రెస్ హయాం కంటే బెటరే కదా అని చెప్పి బిజెపి నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. విజయ్ మాల్యా లాంటి వాళ్ళను దేశం దాటించి తన విధానాలు కూడా కాంగ్రెస్‌కి దగ్గరగానే ఉంటాయని ప్రూవ్ చేసుకున్నాడు మోడీ. ప్రపంచ దేశాల్లో ఉన్న నల్లధనాన్ని రప్పిస్తా అని మోడీ ఇచ్చిన హామీకి అయితే అతీ గతీ లేదు. మోడీ హీరోయిజం పలచబడింది కాబట్టే 2014 ఎన్నికల తర్వాత నుంచి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాల విషయంలో బిజెపికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అలాంటి మోడీ హీరోచితంగా ట్రంప్‌కి బుద్ధి చెప్తాడని, ట్రంప్‌ని దారిలోకి తెస్తాడని బిజెపి నేత కిషన్‌రెడ్డి కామెడీ డైలాగులు పేలుస్తున్నాడు. అమెరికాలో తెలుగు వ్యక్తి హత్య జరిగిన తర్వాత ట్రంప్‌తో పోటీపడిన హిల్లరీ క్లింటన్ కూడా ట్రంప్‌ని ప్రశ్నించింది. సమాధానం చెప్పాలని ట్రంప్‌ని నిలదీసింది. మరి మన మోడీవారు ఏం చేస్తున్నారు? భయాందోళనలకు గురవుతున్న అమెరికాలో ఉంటున్న భారతీయులకు ధైర్యం చెప్పాలన్న విషయం కూడా మోడీకి తెలియకుండా పోయిందా? కనీస స్పందన తెలియచేసే పరిస్థితుల్లో కూడా మోడీ లేడా? అమెరికన్ అధ్యక్షుడు అంటే అంత భయమా? పిల్లల పెంపకం నుంచి భక్తికి సంబంధించిన విషయాల్లో కూడా భారతీయులందరికీ ఎన్నో సందేశాలు ఇస్తూ ఉండే మోడీ ఇప్పుడు శ్రీనివాస్ హత్య గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వేరే దేశస్థుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాల అధినేతలకు చాలా సీరియస్‌గా స్పందించిన సంఘటనలు ఉన్నాయి. అంత వరకూ ఎందుకు…ఇండియాలో ఎవరైనా అమెరికన్ దేశస్థుడు ఇలానే హత్యకు గురయి ఉంటే వైట్ హౌస్ స్పందన ఇలానే ఉండేదా? ట్రంప్ రెస్పాన్స్ ఎలా ఉండేదో ఎవరైనా ఊహించొచ్చు. కానీ మన నరేంద్రమోడీవారికి మాత్రం తీరిక లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో ఎన్ఆర్ఐలను తాను ఎంతగా ప్రేమిస్తాడు, ఎన్ఆర్ఐలు దేశానికి ఎంత సేవ చేస్తున్నారు అనే విషయాలపై ఎన్ఆర్ఐలను మెప్పించడం కోసం గంటలు గంటలు మాట్లాడాడు మోడీ. ఇప్పుడు అదే ఎన్ఆర్ఐలు భయాందోళనలకు గురవుతూ ఉంటే ధైర్యం చెప్పాలన్న స్పృహ మోడీకి లేకుండా పోయింది. అలాంటి మోడీ ట్రంప్‌ని దారిలోకి తెస్తాడని కిషన్‌రెడ్డి కామెడీ చేస్తున్నాడు. అయినా తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ళు అంటూ కిషన్‌రెడ్డి కూడా ఓ రేంజ్లో విద్వేషాలు రెచ్చగొట్టాడుగా. ఇప్పుడు ట్రంప్‌ని విమర్శించే నైతిక అర్హత కిషన్‌రెడ్డికి ఉందా?