దేశం కోసమే మేమున్నాం..! ప్రజాసంపదకు కాపలా కుక్కలం..! ఎవరికీ ఉచితంగా రూపాయి ఇవ్వం..! అంటూ.. పడి గట్టుకు కూర్చుని నాలుగున్నరేళ్ల పాటు.. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం పట్ల.. అత్యంత పీనాసితనం చూపిన… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయారు..? నగదు బదిలీ పథకాలకు వ్యతిరేకమని చెప్పి.. చెప్పి అలసిపోయి.. అదే పథకాన్ని ఎందుకు ప్రవేశ పెట్టారు..? ఓటమి భయం కళ్లలో కనిపించిందా..?
ఇండియాను అమెరికా చేస్తానన్న మోడీ ఈయనేనా..?
ఎన్నికలకు ముందు ఓ బహుబలిలో ఫోజిచ్చి.. ఇండియాను అమెరికా చేస్తా.. రూపాయికి పది డాలర్లు వచ్చేలా చేస్తా.. దేశాన్ని.. ఎక్కడికో తీసుకెళ్లిపోతానని.. చెప్పిన నరేంద్రమోడీ.. ఇప్పుడు.. ప్రభుత్వ డబ్బులతో ఓట్లు కొనుక్కునేందుకు ఆరాటపడుతున్నారు. నాలుగున్నరేళ్లలో… ముందూ వెనుకా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు, లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా.. వేసిన అడుగల ఫలితం.. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలలో కనబడకుండా ఉండాలంటే.. ఏం చేయాలో.. మేథోమథనం చేసి.. చేసి…మోదీ సర్కార్… తాత్కాలిక పద్దు ప్రకటించింది. అవడానికి తాత్కలిక పద్దే కానీ… ఆ ఛాయలు ఎక్కడా కనిపించనివ్వలేదు. కొడిగట్టిపోతున్న తమ ఓటు బ్యాంక్ ను కాపాడుకునేందుకు ప్రధానంగా.. బడ్జెట్ ను వాడుకున్నారు. వీలైనంతగా నగదును పంపిణీ చేసి.. ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు.
రైతుల్ని ముంచేసి రూ. ఆరు వేలిస్తే దేశం బాగుపడినట్లేనా..?
ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు బదిలీ చేయబోతున్నారు. ఇది ప్రధానంగా ఉత్తరాది రైతులను ఉద్దేశించిందే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో.. రైతులు గత నాలుగున్నరేళ్లలో చితికిపోయారు. అంతో ఇంతో మద్దతు ధర దక్కుతూండటంతో .. గతంలో మరీ తీసికట్టుగా ఉండేవారు కాదు. కానీ గత నాలుగున్నేళ్లలో వారి పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. ఫసల్ బీమా యోజనా .. అని.. మరొకటని రైతులకు పథకాలు పెట్టారు. .. ఆ పథకాలకు కేటాయిస్తున్న వేల కోట్లు… ఖర్చయిపోయాయి కానీ రైతులకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. రైతులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేశారు. కానీ పట్టించుకున్న వారు లేరు. పట్టించుకోకపోగా… కేంద్రమంత్రులు.. రైతులకు పని లేక.. అలాంటి పనులు చేస్తున్నారని వెటకారాలు ఆడారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. రైతుల ఆగ్రహాన్ని తగ్గించాలంటే.. నేరుగా నగదు సాయం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారు. అంటే.. కేంద్రం చెబుతున్నట్లుగా.. పన్నెండు కోట్ల మంది రైతులు.. ఐదు ఎకరాల కంటే.. తక్కువ భూమి ఉన్న వారు ఉంటే.. వారందరికీ.. ఏడాదికి ఆరు వేలు అందుతాయి. అంటే.. నెలకు ఐదు వందల రూపాయలన్నమాట. రైతులకు రెట్టింపు ఆదాయం అన్న ప్రకటనల నుంచి మోదీ ప్రభుత్వం.. వారికి నగదు సాయం చేయాల్సినంత స్థాయికి వ్యవసాయ రంగాన్ని మోదీ సర్కార్ తీసుకొచ్చింది. ఇదేనా మోడీ సామర్థ్యం..?
మధ్యతరగతి నడ్డి విరిచిన దానికి మోడీ ఏం చెబుతారు..?
నోట్ల రద్దు, GST అమలుతో మధ్యతరగతి వర్గాలను మోదీ దెబ్బకొట్టారు. దాంతో మధ్యతరగతి కాస్తా దిగువ మధ్యతరగతికి జారిపోయింది. పన్ను మినహాయింపు పెంపు, గ్యాట్యుటీ పెంపు వంటి హామీలతో.. ఇప్పుడు మోడీ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ బడ్జెట్‌కు ఒక్క రోజు ముందు వచ్చిన ఉద్యోగాల రిపోర్ట్ గురించి ఏం చెబుతారు. ఉద్యోగార్థులంతా.. ఉద్యోగాలు కల్పిస్తున్నారంటూ.. గోయల్ తమ చేతకాని తనాన్ని గొప్పగా పార్లమెంట్లో ప్రజెంట్ చేసుకునేందుకు ప్రయత్నించారు కానీ.. అందరూ ఉద్యోగాలు సృష్టిస్తే.. మరి నిరుద్యోగిత ఎందుకుందో.. ఆ బుర్రలకు తెలియదా..?. లేక ప్రజలు అంత అమాయకులనుకున్నారా..?. నోట్ల రద్దు, జీఎస్టీ.. సక్రమంగా తెలివిగా.. సమర్థంగా అలు చేస్తే గొప్ప నిర్ణయాలే. కానీ మోడీ చేతకాని తనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మధ్యతరగతిని ఆకట్టుకోవడానికి.. సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది.
వాతపెట్టి వెన్న పూస్తే ఓట్లేస్తారా..?
నాలుగున్నరేళ్ల పాలనలో… మోడీ సర్కార్.. దేశం కోసం అంటూ.. ప్రజలను ఇష్టం వచ్చినట్లు బాదేసింది. వాతలు పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. అయ్యో వాతలు పడ్డాయా… నేనున్నా.. అంటూ.. వెన్న డబ్బా పట్టుకుని వచ్చింది. వాత పెట్టి వెన్న పూసేందుకు రెడీ అయింది. కానీ.. ప్రజలు.. ఈ నాలుగున్నరేళ్ల బాధల్ని మర్చిపోతారా..?