లోక్ సభలో నిన్న మోడీ ప్రభుత్వంపై చెలరేగిపోయిన రాహుల్ గాంధికి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడి చాలా చల్లగా వాత పెట్టారు. మోడీ నేరుగా రాహుల్ గాంధి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ‘కాంగ్రెస్ అధిష్టానం’ అనే మాట అతని గురించేనని వేరేగా చెప్పనవసరం లేదు. “కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆత్మన్యూనతతో బాధపడుతోంది కనుకనే సభలో ఆవిధంగా వ్యవహరిస్తున్నట్లుంది,” అని రాహుల్ గాంధిని ఉద్దేశ్యించి అన్నారు.
సాధారణంగా ఆత్మన్యూనతతో బాధపడేవారు తమ గురించి ఇతరులు చులకనగా మాట్లాడుకొంటున్నారేమోనని ఎప్పుడూ బాధపడుతుంటారు. ఇతరుల కంటే తాము ఏ విషయంలోను తీసిపోమని నిరూపించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నాలలో ఇతరులపై విమర్శలు గుప్పించడం, చులకనగా మాట్లాడుతూ వారిపై తమ ఆధిక్యతని ప్రదర్శించుకోవాలని చూస్తుంటారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని ముందే గ్రహించిన రాహుల్ గాంధి ఆ ఎన్నికలలో పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టడానికి భయపడ్డారు. పైగా రాజస్థాన్ లో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తను కూడా ఏదో ఒకనాడు ఎవరి చేతిలోనో హత్య చేయబడుతానని భయం వెలిబుచ్చారు. 125 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ప్రధాని అవ్వాలని కోరుకొంటున్న రాహుల్ గాంధి నోటి నుండి అటువంటి పిరికి మాటలు విని ప్రజలు షాక్ తిన్నారు.
ఊహించినట్లే ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయం పాలయింది. అప్పుడే ఆయన పార్టీ ఉపాధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని పార్టీలో డిమాండ్లు మొదలయాయి. ఆ తరువాత లోక్ సభలో పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టామని కోరితే అందుకూ ఆయన వెనుకంజ వేయడంతో మల్లికార్జున్ ఖర్గేకు ఆ బాధ్యతలను కట్టబెట్టవలసి వచ్చింది. ఆ తరువాత వరుసగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించేందుకు రాహుల్ గాంధి వెనుకాడారు. కానీ కర్నాటకలో తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరాక అక్కడ బాధ్యతలు తీసుకొన్నారు. అలాగే బిహార్ ఎన్నికలలో తనకి ఎటువంటి సమస్య ఉండబోదని నమ్మినందునే లాలూ, నితీష్ కుమార్ చేతులు పట్టుకొని తిరిగారు.
సార్వత్రిక ఎన్నికల పరాభవం నుండి కోలుకొన్నాక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టబోతే అందుకు ఆయన అర్హుడు కాడని, ఆయన కంటే ఆయన సోదరి ప్రియాంకా వాద్రా ఆ పదవి చేప్పట్టడానికి అన్ని విధాల అర్హురాలని పార్టీలో నేతలే చెప్పడంతో పార్టీ మీద అలిగి విదేశాలకు వెళ్ళిపోయారు. విదేశాలలో ఎవరి దగ్గర ఏ శిక్షణ తీసుకొని వచ్చారో తెలియదు గానీ తిరిగివచ్చినప్పటి నుండి రాహుల్ గాంధిలో చాలా దూకుడు కనిపిస్తోంది. అప్పటి నుండే ప్రధాని నరేంద్ర మోడినే లక్ష్యంగా చేసుకొని విమర్శించడం మొదలయింది. తనకంటే వయసులో, అనుభవంలో ఎన్నో రెట్లు ఎక్కువ గల మోడీని విమర్శించడం ద్వారా తాను ఆయనకి తను ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకొనేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టారు.
నిజానికి మోడీ ఏటికి ఎదురీదుతూ సమస్యలను సవాళ్ళను దైర్యంగా ఎదుర్కొని ప్రధాని అయితే, రాహుల్ గాంధికి వడ్డించిన విస్తరి ముందుంచినా దానిని కూడా అందుకోలేకపోయాడు. పైగా ఏనాడు దైర్యంగా తన బాధ్యతలను స్వీకరించడానికి ముందుకు రాలేదు. సమస్యలు ఎదురయినప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా తల్లి కొంగు చాటున దాక్కొనేవారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యని పేర్కొన వచ్చును లేదా సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే విషయంలో కావచ్చును. ఎవరూ గుర్తించలేని ఆత్మన్యూనతతో, ఆకారణంగా తీవ్ర అభద్రతాభావంతో రాహుల్ గాంధి బాధపడుతున్నారని చెప్పవచ్చు. మోడీ కూడా ఈరోజు అదే మాట సింపుల్ గా చెప్పారనుకోవలసి ఉంటుంది.